మన్సూరాబాద్, ఏప్రిల్ 11: రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్దనుంచి రూ.32 లక్షల విలువైన 44 తులాల బంగారు ఆభరణాలు, 56.8 తులాల వెండి, రూ.25 వేల నగదు, కారు, లక్ష విలువైన యూఎస్ డాలర్లు, 26 గడియారాలు, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. కర్నాటక, తుమ్మకూరు జిల్లా, కేత్గాన్ మండలం, కొడిగ హడ్డి గ్రామానికి చెందిన జగనాథ్ (28) కారు డ్రైవర్. కర్నాటక రాష్ట్రంలోని ఇందిరానగర్ పీఎస్, వార్తూర్ పీఎస్, హిరియూర్ పీఎస్, దేవనహల్లి పీఎస్ పరిధిల్లో దొంగతనాలకు పాల్పడి పలుమార్లు జైలుకు వెళ్లాడు. 10 ఫిబ్రవరి 2022లో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇదిలా ఉండగా.. బ్రహ్మదు అలియాస్ బ్రహ్మదేవర రాజయ్య అలియాస్ రాజశ్రీ గణేశ్ మియాపూర్, ఘట్కేసర్, ఎల్బీనగర్ పీఎస్ పరిధిల్లో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. రాజశ్రీ గణేశ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. జైలు నుంచి వచ్చిన అనంతరం రాజశ్రీ గణేశ్ బెంగళూర్‌కు వెళ్లాడు. బెంగళూరులో తన మిత్రుడైన ధనుంజయ్ ద్వార జగనాథ్ పరిచయమయ్యాడు. ఇద్దరు పాత నేరస్తులు ఓ ముఠాగా ఏర్పడ్డారు.
పట్టుబడకుండా వాట్సాప్ ద్వారానే ఫోన్
ఉదయం సమయంలో కాలనీల్లో యాక్టివా వాహనంపై సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లను గమనించే వారు. దొంగతనం చేయాలని అనుకునే ఇంటి వద్ద జగనాథ్ను దింపి సమీపంలోని పార్కులో రాజశ్రీ గణేశ్ వేచి ఉంటాడు. దొంగతనం చేసిన అనంతరం జగనాథ్ వాట్సాప్ కాల్ ద్వార రాజశ్రీ గణేశ్‌కు సమాచారం ఇస్తాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు గాను దొంగతనాలకు వెళ్లిన సమయంలో ఇరువురు వాట్సాప్ కాల్ ద్వారానే సమాచారం పంచుకుంటారు. ఈ విధంగా మార్చి 7న ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాక్‌టౌన్ కాలనీలో ఓ ఇంటితో పాటు ఫార్మసీ ఆఫీస్‌లో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్లో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా తచ్చాడుతున్న జగనాథ్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇద్దరు కలిసి మూడు రాష్ర్టాల్లో మొత్తం ఏడు ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దొంగతనాలు చేయగా వచ్చిన డబ్బులతో ఓఎల్ఎక్స్లో కారును కొనుగోలు చేశారు. నిందితులైన జగనాథ్ను రిమాండ్‌కు తరలించారు. రాజశ్రీ గణేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సమావేశంలో డీసీపీ క్రైమ్స్ పి.యాదగిరి, ఎల్బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.