సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ, మాండలికాలు, పదకోశాలు, జనజీవిత భాష….వీటన్నింటితో తెలంగాణ మహా నిఘంటువును తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ దార్శనికత ఆలోచనలకు అనుగుణంగా సాహిత్య అకాడమీ కార్యచరణకు సిద్ధ్దంగా ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సుప్రసిద్ధ సంపాదకుడు గోరాశాస్త్రి శతజయంతి సందర్భంగా ప్రసంగ వ్యాసాల సంకలనం, ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణ రచించిన ‘కన్నవీ విన్నవీ’ గ్రంథ పరిచయ సభ వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జీఎస్ వరదా చారి అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగింది. ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు కె. శివా రెడ్డి, జూలూరు గౌరీశంకర్‌లు హాజరై మాట్లాడారు.
తెలుగు యూనివర్సిటీ, తెలుగు అకాడమీ , అన్ని దిన పత్రికల సంపాదకులు ఇలా అందరినీ కలుపుకొని ఈ మహా నిఘంటవు రూపకల్పన చేయబోతున్నామన్నారు.నాటి కాలంలో ఒక నిఘంటవు తయారు చేయడానికి దశాబ్ధ్దకాలం పట్టేదని, కాని నేడు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో చేసే పనిని ఒక్క సంవత్సరంలో చేయడానికి సౌలభ్యం, యంత్రాగాన్ని తాము ఏర్పాటు చేసుకొని ఈ నిఘంటవు రూపకల్పన చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రెంటాల జయదేవ, డాక్టర్ గోపరాజు నారాయణ రావు, ఉడయవర్లు తదితరులు పాల్గొన్నారు.