ఎల్బీనగర్,ఏప్రిల్11:హలీం విక్రేతలు నిబంధనలు పాటించకుంటే కేంద్రాల ను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణ య్య, హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ మారుతీ దివాకర్ హెచ్చరించారు. సోమవారం ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలో హలీం విక్రయించే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సం దర్భంగా ఉప కమిషనర్లు మాట్లాడుతూ హలీం తయారు చేసే బట్లీలు మొదటి అంతస్తుల్లో పెట్టకూడదని, గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టాలని సూచించారు. హలీం అమ్మే ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండే లా చూసుకోవడంతో పాటుగా పశుసంవర్ధక శాఖ అధికారులు సూచించిన నియమనిబంధనల ప్రకారం నాణ్యమైన, తాజా మాంసాన్నే హలీం తయారీకి వాడాలన్నారు. హలీం షాపుల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనారు.కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పాటుగా హలీం కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.