మల్కాజిగిరి, ఏప్రిల్ 1: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు రాచకొండ పోలీసులు. పంజాబ్ రాష్ట్రం నుంచి డ్రగ్స్ తెచ్చి..సరఫరా చేస్తుండగా, నిందితులను పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రం తరన్‌తరన్ జిల్లా కాదుర్షాబికి చెందిన జగ్తార్‌సింగ్ (58) 12 ఏండ్ల కిందట జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ టోల్ ప్లాజా సమీపంలో సందీప్ పంజాబీ పేరుతో దాబా నిర్వహిస్తున్నాడు. ఇందులో పంజాబ్‌కు చెందిన జయమాల్ సింగ్(28) పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ రంజిత్‌సింగ్ ఇక్కడకు వచ్చిపోతుండటంతో జగ్తార్సింగ్తో స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలిసి డ్రగ్స్ దందా చేయాలని ప్లాన్ వేసుకున్నారు.
గ్రాముకు రూ. 300 చొప్పున..
పంజాబ్‌లో రంజిత్‌సింగ్ పప్పియా స్ట్రాలతో(గసగసాలు)తో తయారు చేసిన నార్కోటిక్ డ్రగ్స్ గ్రాముకు రూ. 300 చొప్పున కొని, తన లారీలో తరలించి.. జగ్తార్సింగ్కు అందిస్తే..అతడు దాబాలో ఒకటి, రెండు గ్రాముల చొప్పున డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి.. గ్రాముకు రూ. 700లకు జయమాల్సింగ్ ద్వారా వినియోగదారులకు విక్రయించేవాడు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, విద్యార్థులు, కార్మికులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలాఉండగా మల్కాజిగిరి ఎస్వోటీ టీం డీసీపీ మురళీధర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని లేక్ ప్యూ దాబా వద్ద ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం తనిఖీలు చేపట్టింది. కారులో ఉన్న జగ్తార్‌సింగ్, జయమాల్ వద్ద 900 గ్రాముల డ్రగ్స్, రూ.1.44 లక్షల నగదు లభించింది. ఇద్దరిని అరెస్ట్ చేసి సుమారు రూ.15 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రంజిత్‌సింగ్ కోసం గాలిస్తున్నట్లు సీపీ వివరించారు.
పప్పియా స్ట్రా అంటే..
పంజాబ్‌లో ఎక్కువగా పండే పప్పియా స్ట్రాల(గసగసాలు)తో డ్రగ్స్‌కు సంబంధించిన ముడిపదార్థం తయారు చేస్తారు. కొద్దిగా కెమికల్స్ కలిపితే మార్ఫిన్ అనే మత్తు మందు రూపొందుతుంది. దానిని మరింత ప్రాసెసింగ్ చేస్తే…హెరాయిన్ తయారవుతుంది. ఈ హెరాయిన్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది.