మురుగు సమస్యల కోసం రూ.22కోట్లు
ఎమ్మెల్యే దానం నాగేందర్
ఫిలింనగర్లో పనులు ప్రారంభం
బంజారాహిల్స్,ఏప్రిల్ 1: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం రూ.22కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్, వినాయక్‌నగర్ ప్రాంతాల్లో శుక్రవారం రూ.92లక్షల వ్యయంతో సీవరేజీ, మంచినీటి పైపులైన్ పనులను ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఫిలింనగర్ బస్తీల్లో మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని, ఇప్పుడు నీటి సమస్య పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం వినాయక్‌నగర్, గౌతమ్‌నగర్, దుర్గాభవానీనగర్, బాల్‌రెడ్డినగర్, జైల్‌సింగ్‌నగర్ బస్తీల్లో మురుగు సమస్యను తగ్గించేందుకు రూ.92లక్షలతో పనులు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా డివిజన్ పరిధిలో సీవరేజీ పనుల కోసం సుమారు రూ.3కోట్లు కేటాయించగా సీసీ రోడ్ల కోసం రూ.3.5కోట్లు మంజూరయ్యాయన్నారు. ముందుగా సీవరేజీ పనులు పూర్తి చేసిన తర్వాత రోడ్డు పనులు చేపట్టనున్నామన్నారు. వీటితో పాటు నియోజకవర్గంలో సీసీ రోడ్లు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణం కోసం రూ.25కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, చంద్రశేఖర్, నగేష్. ఎల్లయ్య, అబ్దుల్ ఘనీ, అశోక్, సంపంగి కిరణ్, ఆవుల రాజన్న, హనుమమ్మ, వెంకటస్వామి,టి.రాములు, సుగుణమ్మ , శ్రీను తదితరులు పాల్గొన్నారు.