సికింద్రాబాద్/మారేడ్‌పల్లి, మార్చి 30: రెక్టం క్యాన్సర్‌పై ప్రజలలో విస్తృత ప్రచారం చేయడం ద్వారా దాని నివారణకు కృషి చేయడం జరుగుతుందని కార్ఖానాలోని రెనోవా సౌమ్య క్యాన్సర్ దవాఖాన మెడికల్ అంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ పేర్కొన్నారు. నానాటికీ మారుతున్న జీవన శైలి కారణంగా ఏర్పడుతున్న ఊబకాయం, మత్తు పానియాలు, పొగాకు ఆధారిత పదార్థాలు సేవించడం, సరైన వ్యాయామం చేయకపోవడం వంటి పలు కారణాలతో క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటా యన్నారు. ఈ మేరకు బుధవారం కార్ఖానాలోని రెనోవా సౌమ్య క్యాన్సర్ దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి 50 ఏండ్లు పైబడిన వారు కొలనో స్కోపి పరీక్షను ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి చేయించుకోవడం ద్వారా కౌలిబ్స్ను గుర్తించవచ్చని వివరించారు. శస్త్ర చికిత్స వీలుకాని సందర్భాలలో ఇమ్యూనోథెరపీ, కీమో థెరపీ లేదా రేడియేషన్ థెరపీ లాంటి చికిత్సలు అందించి క్యాన్సర్ పరిణామాన్ని తగ్గించి తర్వాత శస్త్ర చికిత్స చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా రెక్టం అంటే మల విసర్జన ద్వారం వద్ద ఏర్పడే క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే రాకుండా మంచి జీవన శైలిని పాటించడం ద్వారా నివారించుకోవచ్చని వైద్యులు సూచించారు. కార్యక్రమంలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (మెడికల్) జనార్దన్‌తో పాటు రెనోవా సౌమ్య క్యాన్సర్ హాస్పిటల్స్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.