కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 24 : హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ యూబీడీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత లు అన్నారు. గురువారం కూకట్పల్లి జోన్ ఆఫీస్‌లో హరితహారంపై నిర్వహించిన సమీక్షలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, జీహెచ్ఎంసీ యూబీడీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, యూబీడీ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో విరివిగా మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలన్నారు. వార్డుల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన మొక్కలు నాటాలన్నారు. చెరువు పరిసరాలను మొక్కలతో సుందరీకరణ చేయాలని, మల్టీలేయర్ ప్లాంటేషన్‌పై దృష్టిసారించాలన్నారు. నర్సరీలలో మొక్కలను ప్రజలకు పంపిణీ చేయడంతో పాటు వాటిని నాటి సంరక్షించేలా అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో మొక్కలు నాటే ఉద్యమంలో ప్రజలందరినీ భాగస్తులు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్లు రవీందర్‌కుమార్, ప్రశాంతి, మంగతాయారు, నాగమణి, యూబీడీ సర్కిల్ మేనేజర్లు, సిబ్బంది ఉన్నారు.