శామీర్‌పేట, మార్చి 24 : తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యం గింజను కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మొండి వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని సీఎంఆర్ కన్వెన్షన్‌లో గురువారం నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఝూటామాటల ప్రభుత్వమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్రం ధాన్యం కొనుగోలుపై కిరికిరి పెడుతున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రి, నలుగురు ఎంపీలున్నా… తెలంగాణకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. తెలంగాణలో ప్రజల ఓట్లతో గెలిసిన కేంద్ర మంత్రి, ఎంపీలు ధాన్యం కొనుగోలుపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, ఎంపీపీలు ఎల్లూబాయిబాబు, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, మండల అధ్యక్షుడు సుదర్శన్, మల్లేశ్ గౌడ్, నోముల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్‌యాదవ్, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు..
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు ప్రారంభమయ్యాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సన్నాహక సమావేశంలో తుర్కపల్లికి చెందిన బీజేపీ నాయకుడు బి.నరేందర్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి మంత్రి ఆహ్వానించారు.