బంజారాహిల్స్,మార్చి 24:డీజిల్. పెట్రోల్‌తో పాటు గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో మహిళలు కదం తొక్కారు. టీఆర్ఎస్ పిలుపుతో పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్లపైకి వచ్చి గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఫిలింనగర్లో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ. ఖైరతాబాద్, హిమాయత్నగర్లకు చెందిన టీఆర్ఎస్ మహిళా విభాగం కార్యకర్తలతో పాటు కార్పొరేటర్లు కవితారెడ్డి, వనం సంగీతాయాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ప్రసన్న, మాజీ కార్పొరేటర్ హేమలతాయాదవ్తో సహా పెద్ద సంఖ్యలో మహిళలు ఈ మహా ధర్నాలో పాల్గొని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, షేక్ అహ్మద్, నగేష్ సాగర్. చంద్రశేఖర్, గోపాల్ నాయక్, కిరణ్‌కుమార్, విష్ణునాయక్, నడిమింటి కృష్ణ, దయ్యాలదాసు, మహిళా విభాగం నాయకులు పద్మ, రాములమ్మ, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ డివిజన్లో..
పెంచిన గ్యాస్ సిలిండర్, డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా ఖైరతాబాద్ డివిజన్లో కార్పొరేటర్ పీ.విజయారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పంజాగుట్ట చౌరస్తాలో పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా తోపుడు బండిపై స్కూటర్‌ను పెట్టి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయారెడ్డి మాట్లాడుతూ..పెట్రోలియం ఉత్పత్తుల పెంపుతో నిత్యావసర ధరలను గణనీయంగా పెరుగుతున్నాయని, సామాన్యులపై మోయలేని భారం వేయడం సరికాదన్నారు.
మహిళలతో పెట్టుకుంటే అధోగతే..
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అనేక రకాలైన పథకాలతో సీఎం కేసీఆర్ లబ్ధి చేకూరుస్తుండగా కేంద్రంలోని మోదీ సర్కార్ మాత్రం మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.1002కి పెంచడం దారుణమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫిలింనగర్లో ఏర్పాటు చేసిన మహా ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఐదు రాష్ర్టాల ఎన్నికలు అయిపోగానే ధరలు భారీగా పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేస్తుందని, రాష్ట్ర బీజేపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు పెట్రోలియం ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
-దానం నాగేందర్, ఎమ్మెల్యే