సుల్తాన్‌బజార్, మార్చి 24 : కోఠిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ కళాశాలలో ఉస్మానియా తక్ష్-2022 పేరిట గురువారం ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.విజ్జులత ఓపెన్ హౌజ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కళాశాలలోని అన్ని విభాగాలతోపాటు కెమిస్ట్రీ ల్యాబ్, ఆడిటోరియం, ఎస్సీసీ కేంద్రం కళాశాల ఆవరణలోని దర్బార్ హాల్‌ను ప్రతిఒక్కరూ కలియ తిరిగేందుకు ఒక్కరోజు ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు కళాశాలల్లోని బోధన ఎలా ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు ఏ విధంగా విద్యను అందిపుచ్చుకుంటారు అనే విషయాలను నేరుగా తెలుసుకునేందుకు పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కళాశాలకు చేరుకొని కళాశాలలోని అన్ని బ్లాక్‌లను తిలకించారు. ఈ కార్యక్రమంలో కోఠి మహిళా కళాశాల బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.