ముషీరాబాద్, మార్చి 24: పెరిగిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పేదలపై మోదీ ప్రభుత్వం మోయలేని పెనుభారం మోపుతుందని ఆరోపిస్తూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదల నడ్డి విరిచే చర్యలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధానీ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ బాటిళ్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రాంనగర్ చౌరస్తాలో జరిగిన నిరసన ప్రదర్శనలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసించారు. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ బాటిళ్లతో ధరల పెరుగుదలపై నిసరన తెలిపారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నినాదాలు, నిరసన ప్రదర్శనలతో రాంనగర్ ప్రాంతం హోరెత్తింది.
పేదల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వం..
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే చర్యలకు పాల్పడుతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వనరులు పెంచుకోవడం, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పని చేస్తుందని మండిపడ్డారు. డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదల మూలంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నిత్యావసర సరుకుల ధరణను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, మోదీ ప్రభుత్వాన్ని బంగాళాకాతంలో కలిపితేనే దేశానికి, ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు. వంటగ్యాస్ ధరల పెంపును మహిళా లోకం జీర్ణించుకోలేకపోతుందని, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.450 ఉన్న వంట గ్యాస్ ధరను నేడు వెయ్యి దాటినా పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం వెంటనే పెంచిన డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ కార్పొరేటర్లు ముఠా పద్మ, టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్, టీఆర్ఎస్ పార్టీ ఐదు డివిజన్ల అధ్యక్షులు వై.శ్రీనివాస్, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, ఆర్.మోజస్, వల్లాల శ్యామ్ యాదవ్, రాకేశ్‌కుమార్, నాయకులు వి.సుధాకర్‌గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, కె.సురేందర్, నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, మల్లికార్జున్‌రెడ్డి, షరిపుద్దీన్, బింగి నవీన్, ముఠా నరేశ్, దామోదర్‌రెడ్డి, ఆకుల అరుణ్, శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, శోభ, సంపూర్ణ, మాధవి, కల్పన తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను ఊరేగించి ధరల పెరుగుదల పట్ల నిరసన తెలిపారు.