విధిగా సమావేశానికి హాజరు కావాలి
మండల సమావేశంలో సభ్యులు
మేడ్చల్ రూరల్, మార్చి 23 : అధికారుల తీరు మారాలి.. సహాయకులను పంపకుండా విధిగా మండల సమావేశానికి హాజరు కావాలి.. అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, సభ్యులు సూచించారు. మేడ్చల్ మండల పరిషత్ సమావేశం ఎంపీపీ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్షా నిర్వహించారు. విద్యుత్, రెవెన్యూ, వైద్య, ఉద్యానవన తదితర శాఖల అధికారుల తీరు మారాలని సూచించారు. మండల సమావేశానికి తమ సహాయకులను కాకుండా మండల స్థాయి అధికారులే హాజరుకావాలని తెలిపారు. అప్పుడే సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. ఆర్టీసీ శాఖకు సంబంధించి డీఎంకు బదులుగా సహాయకులు వస్తే నివేదికను చదవకుండా సభ్యులు అడ్డుకున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది కరెంట్ పోయిన సమయంలో ఫోన్లు ఎత్తడం లేదని, సమస్యలను పరిష్కరించడంలేదని ఎల్లంపేట, మునీరాబాద్ గ్రామ సర్పంచులు గోప గణేశ్, చిట్టిమిల్ల గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యానవన శాఖ నుంచి ఎంతోమంది రైతులకు ఉపయోగపడే పథకాలు ఉన్నప్పటికీ ప్రచారం మాత్రం చేయడం లేదన్నారు.
రాజబొల్లారం తండా పంచాయతీ సర్పంచ్ మంగ్యానాయక్ మాట్లాడుతూ.. మేడ్చల్ సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ జ్యోతి సమాధానమిస్తూ కొన్ని కేసుల విషయంలో సాంకేతిక కారణాల వల్ల తాము అభ్యంతరం చెపుతున్నామని చెప్పగా, ఎంపీపీ రజితారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయానందారెడ్డి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న సమస్యలను సర్పంచ్, ఎంపీటీసీలతో కలిసి పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. నూతన్‌కల్‌లో వివాదంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని పీఏసీఎస్ చైర్మన్ సురేశ్ రెడ్డి రెవెన్యూ అధికారులను కోరారు. గ్రామాల్లో ఖాళీగా ఉన్న వీఆర్ఏ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పలువురు సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, ఎంపీడీవో రమాదేవి, కో ఆప్షన్ సభ్యురాలు రుక్సానా, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.