స్టేట్ హోం ఆవరణలో దవాఖాన ఏర్పాటు
ఉచితంగా 25 రకాల ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ
స్టేట్ హోంతో పాటు..వెంగళరావునగర్ డివిజన్,ఎల్లారెడ్డిగూడ ప్రాంతవాసులకు ప్రయోజనం
వెంగళరావునగర్, మార్చి 23: వెంగళరావునగర్ డివిజన్లోని స్టేట్ హోం ఆవరణలో సర్కారు బస్తీ దవాఖాన ఏర్పాటైంది. ఈ బస్తీ దవాఖాన స్టేట్ హోం ప్రధాన రహదారిపై ఉండడంతో తో ఇటు డివిజన్లో ఉన్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయం లో ఉన్న బాలసదనం, స్టేట్ హోం, కాలేజ్ అట్ హోం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, సర్వీస్ హోంలలో ఆశ్రయం పొందే యువతులు, మహిళలతో పాటు పరిసర ప్రాంతవాసులకు ఈ బస్తీ దవాఖాన ఎంతో ప్రయోజనకరంగా మారింది. స్టేట్ హోంలోని వివిధ హోమ్స్‌లలో ఆశ్రయం పొందే వారితో పాటు ఇక్కడ పని చేసే సిబ్బందితో కలుపుకొని దాదాపు వెయ్యి మందికి ఈ బస్తీ దవాఖాన అందుబాటులోకి వచ్చింది. ఈ బస్తీ దవాఖానలో డాక్టర్ కల్పనతో పాటు ఒక స్టాఫ్ నర్సు, కాంపౌండర్ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ షుగర్ టెస్టులతో సహా 25 రకాల ఆరోగ్య పరీక్షలన్నీ ఉచితంగా లభిస్తున్నాయి. రోగులెవరికైనా ఎక్స్‌రే అవసరమైనప్పుడు శ్రీరాంనగర్‌లోని యూసీహెచ్సీకి పంపుతారు. పరిసర ప్రాంతాలైన ఎల్లారెడ్డిగూడ, మధురానగర్ కాలనీ,యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్ కాలనీ, వెస్ట్ శ్రీనివాస్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్తీ దవాఖానకు పేద రోగులు వస్తున్నారు. జ్వరాలు, జలుబు, దగ్గు, తలనొప్పి ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్ల వంటి తదితర రోగాలకు ఇక్కడ చికిత్స లభిస్తోంది.
గతంలో స్టేట్ హోంలో ఆశ్రయం పొందేవారికి ఎవరికైనా వైద్య చికిత్స అవసరమైనప్పుడు దూర ప్రాంతాల్లోని దవాఖానకు వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అన్ని వైద్య పరీక్షలు వైద్య సేవలు, కావాల్సిన మందులన్నీ ఉచితంగానే లభ్యమవుతున్నాయి.బస్తీ దవాఖాన ఏర్పాటుతో ప్రైవేటు క్లీనిక్‌కు రోగులు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రైవేటు క్లినిక్‌లో రూ.300 నుంచి రూ.500 వరకు కన్సల్టేషన్ ఫీజు, ఇక మిగిలి వైద్య పరీక్షలకు అదనపు చార్జీలతో రోగులకు తడిసి మోపుడయ్యేది. అంత డబ్బు పెట్టలేక రోగాలతోనే కాలాన్ని నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టెస్టులు ఫ్రీ, మందులు ఫ్రీగా ఇస్తుండటంతో పేద రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉచితంగా ఖరీదైన వైద్య సేవలు
ఉచితంగా ఖరీదైన వైద్య సేవలు బస్తీ దవాఖాన ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. ప్రైవే టు క్లీనిక్‌లకు వెళ్లి డబ్బును వెచ్చించాల్సినఅవసరం లేదు. ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి పేదలు వైద్య పరీక్షలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. పరిసర ప్రాంత ప్రజలు ఈ బస్తీ దవాఖానను సద్వినియోగం చేసుకోవాలి. 25 రకాల వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నాం. కావాల్సిన మందులను కూడా ఉచితంగా అందిస్తున్నాం. పేదలను ఆరోగ్యవంతులుగా చేయడమే ఈ బస్తీ దవాఖాన లక్ష్యం.
–డాక్టర్. కల్పన