భవిష్యత్ తరాలకు కానుకగా ఇద్దాం
ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండాలి
జలమండలి ఆధ్వర్యంలో అవగాహన
హాజరైన సిటీ నటుడు గిరిబాబు, గున్న రాజేందర్‌రెడ్డి
బంజారాహిల్స్, మార్చి 23:వాన నీటి సంరక్షణ ప్రాధాన్యతతో పాటు నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జలమండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా జలమండలి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ రకాలైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. జలమండలి డివిజన్ 6 పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మంగళవారం ప్రారంభమైన అవగాహన కార్యక్రమాలు ఈ నెల 31దాకా కొనసాగనున్నాయి. ర్యాలీలు, సమావేశాలు, ఇంకుడు గుంతల మరమ్మతులు, రోడ్‌షోలు, వాకర్స్‌తో సమావేశాలు, పాఠశాలల్లో విద్యార్థుల కోసం కవితలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లోని వాటర్ థీమ్ పార్కులో..
వాన నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 51లోని జలమండలి థీమ్ పార్కులో కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీనటుడు గిరిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రోజురోజుకూ అడుగట్టుతున్న భూగర్భ జలాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గిరిబాబు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను నిర్మించుకోవడం ద్వారా రానున్న వర్షాకాలంలో వర్షపునీటిని ఒడిసిపట్టవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం హరిశంకర్, జూబ్లీహిల్స్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, జలమండలి డీజీఎం శ్రీనివాస్, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, మహిళా కన్వీనర్ మైనేని వాణి, ఎం. రవి, గిరిధర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు నగేష్ సాగర్, లక్ష్మీనారాయణ, ఓ.శ్రీను, అశోక్. రాము లు పాల్గొన్నారు.