సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): మంటల కన్నా పొగ చాలా ప్రమాదకరం. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను త్వరగా విస్తరింప చేస్తుంది. పొగ ఊపిరితిత్తుల్లోకి చేరి మనిషి 2 నుంచి 3 నిమిషాల్లోనే కుప్పకూలిపోతాడు. ఎంత శరీరక దారుడ్యం ఉన్నా పొగ కమ్ముకుంటే మృత్యు ఒడికి చేరడం ఖాయమని అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నుంచి మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
గోదాంలలో కార్మికులు బస చేయొద్దు
పరిశ్రమలు, గోదాంలు, కట్టెల మండీలు, టింబర్ డిపోలు, స్క్రాప్ గోడౌన్లలో రాత్రి సమయంలో కార్మికులు నిద్రించకుండా చూసుకోవాలి. వారికి మరో చోట బస కల్పించాలి.
గోదాంలలో సామగ్రి అంతా ఒకే చోట పెట్టుకోవద్దు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలు వేగంగా విస్తరిస్తాయి.
గోడౌన్లు, పరిశ్రమల్లో అగ్నిప్రమాద నివారణ పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. లేని పక్షంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తాం.
అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.
బీడీలు, సిగరేట్ తాగేవారు జాగ్రత్తగా ఉండాలి.
10 నిమిషాల్లో అగ్నిమాపక సేవలు..
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 11 ఫైర్ స్టేషన్లలో 18 అగ్నిమాపక వాహనాలు ఉన్నాయని రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 52 మీటర్ల ఎత్తులో కూడా మంటలను ఆర్పేసే బ్రాంటో వాహనం కూడా ఉందన్నారు. అంతేకాకుండా వేగంగా వెళ్లడానికి టూవీలర్స్‌తో పాటు చిన్న వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 20 నిమిషాల్లో అగ్నిమాపక సేవలను అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఎల్బీనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో నూతన ఫైర్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.