సికింద్రాబాద్, మార్చి 23 : ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలపడిందని, అధునాతన సాంకేతికత అందిపుచ్చుకుంటూ ముందుకుసాగుతున్నదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. బుధవారం వంటిమామిడిలో పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్యామ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్, రాంకీ ఫౌండేషన్, గురునానక్ కళాశాల యాజమాన్యం సహకారంతో నిరుద్యోగ యువతకు గత ఆరు నెలలుగా పోలీస్ శిక్షణ ఇస్తున్న కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో డీజీపీగా మహేందర్రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఎంతో అద్బుతంగా శాంతిభద్రతల రక్షణకు పాటుపడుతున్నారని చెప్పారు. సజ్జనార్ లాంటి ఐపీఎస్లు ఉండటంతో పోలీస్ శాఖపై మరింత నమ్మకం ఏర్పడిందన్నారు. నిరుద్యోగ యువతకు ఇంత పెద్ద ఎత్తున ఉచిత శిక్షణను ఇచ్చేందుకు పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుకర్స్వామి ముందుకురావడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో సమూల మార్పులు రావడంతో పురోగతి దిశగా రాష్ట్రం పయనిస్తుందని తెలిపారు.