సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : గోదాములలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో ఆందోళన నెలకొంది. జనావాసాల్లో అక్రమంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోదాములతో ప్రజలు కలవరానికి గురవుతున్నారు. అగ్గికి ఆజ్యం పోసే చెత్త వస్తువుల గోదాములను జనావాసాల నుంచి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భోలక్‌పూర్ ఘటన తర్వాత ప్రభుత్వం తోళ్ల పరిశ్రమలను తరలించింది. ఇదే సమయంలో రద్దీ ప్రాంతాల్లో ఉన్న గోదాములకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. కానీ చాలా మంది నేటికీ అక్రమంగా నడుపుతున్నారు. పైగా నిర్వహణలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు.
ఈ నేపథ్యంలోనే విద్యుదాఘాతాలకు ప్రధానంగా అధిక విద్యుత్ వాడకంతో తీగలు కాలిపోవడం ఒకటైతే..షార్ట్ సర్క్యూట్‌తో నిప్పు అంటుకోవడం రెండోది. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని చాలా మంది గోదాం నిర్వాహకులు తీగల వినియోగంలో ఏ మాత్రం ప్రమాణాలు పాటించడం లేదు. ఎక్కువ చోట్ల అతుకులు, ఎర్తింగ్ లోపాలు, ఓవర్‌లోడ్ ప్రమాదాలకు కారణం అవుతోంది. జీహెచ్ఎంసీ, పీసీబీ, పరిశ్రమల శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి అక్రమంగా ఉన్న గోదాములపై తనిఖీలు చేపట్టాలని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
గోదాముల లెక్కలివే..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని గోదాములు దాదాపు 23 వేలు వాటిలో రసాయ గోదాములు ఆరు వేలు మొత్తం అనుమతి లేని గోదాములు సుమారు 8, 500వేల పైనే ఒక్క సికింద్రాబాద్‌లోనే 280 వరకు ఉన్నట్లు అంచనా.
అల్లాపూర్ డివిజన్ పరిధి వివేకానందనగర్‌లో నివాసాల నడుమ స్క్రాప్ గోడౌన్ ప్రమాదకరంగా మారింది. ఒక పక్కన స్కూల్, మరో పక్కన కిచెన్ ఉండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఫ్రెండ్స్ కాలనీలోని ఫర్నీచర్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ప్రాణ నష్టం జరగలేదు.
ఫతేనగర్ డివిజన్ పరిధిలోని దీన్‌దయాళ్‌నగర్, బాలానగర్ కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, జింకలవాడ, సమతానగర్, వెంకటేశ్వర కో ఆపరేటివ్ ఇండస్రియల్ ఎస్టేట్ పరిధిలో పలు స్క్రాప్, పాతసామాన్ల గోడౌన్లు దాదాపుగా 20 వరకు ఉన్నాయి.
రాంగోపాల్‌పేట్ డివిజన్లోని రాణిగంజ్, నల్లగుట్ట, ఓల్డ్బోయిగూడ, మహంకాళి వీధి, మినిస్టర్ రోడ్డు ప్రాంతాల్లోనూ రసాయన నిల్వ కేంద్రాలు, స్క్రాబ్ గోదాంలు వందల సంఖ్యలో ఉన్నాయి. రెండేళ్ల క్రితం రాణిగంజ్‌లోని ఓ రసాయన కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
బేగంపేట్ డివిజన్లో ప్రకాశ్‌నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో పదుల సంఖ్యలో స్క్రాబ్ గోదాములు ఉన్నాయి.
అంబర్‌పేట, గోల్నాక డివిజన్లో పరిధుల్లో ప్లాస్టిక్, పేపర్, అట్టల గోదాములు వెలిశాయి. గత ఏడాది నవంబర్ 8న గోల్నాక డివిజన్ జిందాతిలస్మాత్ రోడ్డులోని న్యూగంగానగర్లో ఓ వేస్ట్ పేపర్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. అదే నెలలో గోల్నాకలో బాణాసంచా వల్ల ఓ స్క్రాప్ గోదాములో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి.
కాటేదాన్ పారిశ్రామిక వాడలోని బాబుల్‌రెడ్డినగర్, మార్కండేయనగర్, టాటానగర్, టీఎన్జీవోస్ కాలనీ, గణేశ్‌నగర్, ఇందిరాగాంధీ సొసైటీ వంటి కాలనీలలో పరిశ్రమలు, గోదాములు ఉన్నాయి. గత నెల 28న ఆరాంఘార్ ప్రధాన రహదారిలో ఉన్న సూర్యదాబాకు ఆనుకుని ఉన్న ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగి ప్రక్కనే ఉన్న డెకరేషన్ సామగ్రి గోదాముకు కూడా మంటలంటుకున్నాయి.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బిస్మిల్లా కాలనీలోని అగర్బత్తీ కంపెనీలో, జల్పల్లిలో పరుపుల తయారీ కంపెనీలో, శ్రీరామకాలనీలో స్క్రాప్ గోడౌన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదాలు జరిగాయి. ఆస్తి నష్టం జరిగినా ప్రాణనష్టం లేదు.
జియాగూడ కబేళా బైపాస్ రోడ్డులో ఓ ప్లాస్టిక్ గోడౌన్లో సిలిండర్ పేలీ భారీ అగ్ని ప్రమాధం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు.
2016లో కబేళా బైపాస్ రోడ్డులో ప్లాస్టిక్ నిల్వలు ఉండంతో అగ్ని ప్రమాదం జరిగి 26 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.
2017 జనవరి 16న జియాగూడ డోర్బస్తీ ఫర్నిచర్ గోడౌన్లో మంటలు అంటుకున్నాయి.
జియాగూడ కేశవస్వామినగర్‌లో రోడ్డులో ప్లాస్టిక్ నిల్వలు ఉండడడంతో అగ్ని ప్రమాదం జరిగింది.
కార్వాన్ రోడ్డులో ఎంబీ పెయింట్ కంపెనీలో 2018లో భారీ అగ్ని ప్రమాధం జరిగింది.
ప్రాణాలు పోతాయని ఊహించలేదు..
బీహార్ నుంచి మేము ఎప్పుడో వలస వచ్చాం. ఇక్కడి దుకాణాలలో కార్మికులుగా పని చేస్తున్నాం. రోజు పనితో పాటు వసతి కల్పించే ప్రదేశాల్లోనే పని చేయడానికి ఆసక్తి కనబరుస్తాం. బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో మా జిల్లాకు చెందిన 12 మంది యువకులు మూడేండ్లుగా పని చేస్తున్నారు. పొట్టి కూటి కోసం ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోతారని ఉహించలేదు. చనిపోయిన వారంతా నిరుపేద కుటుంబాల వారే.
– శంకర్‌దాస్, అంబర్‌పేట
ఇలాంటి దుర్ఘటన ఎన్నడూ జరుగలేదు..
తెల్లవారు జామున 4 గంటలకు బోయిగూడలో కరంటు పోయింది. ఇంతలో పొగలు కనిపించడంతో నేను ఐడిహెచ్ కాలనీ నుంచి కొందరి యువకులతో కలిసి స్క్రాప్ దుకాణం వద్దకు వచ్చాను. అప్పటికే డీఆర్ఎఫ్, అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇంతలో మొదటి అంతస్తు నుంచి ఓ యువకుడు కాలిన గాయాలతో కింద పడ్డాడు. పైన గదిలో తన మిత్రులు ఉన్నారని సైగలు చేయడంతో సిబ్బంది పైకి వెళ్లి చూడగ 11 మంది సజీవ దహనం అయి కనిపించారు. ఇలాంటి దుర్ఘటన మా బోయిగూడలో గతంలో ఎన్నడు జరగలేదు. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
– వెంకటేశన్రాజు, బోయిగూడ
ఇలాంటి వార్త వింటామనుకోలేదు..
స్క్రాప్ గోదాం అగ్ని ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనం కావడం చాలా బాధాకరం. తెల్లవారుజామునే ఇలాంటి వార్త వింటామనుకోలేదు. మా స్నేహితుల ద్వారా విషయం తెలుసుకొని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. అధికారులు గోదాంలను తనిఖీలు చేస్తే…ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.
– మల్లేశ్, బోయిగూడ
చాలా బాధగా ఉంది
బీహర్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చి ఇలా చనిపోవడం చాలా బాధ వేస్తుంది. ప్రతి రోజు ఉదయం ఈ గోదాం నుంచే వెళ్తుంటాను. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని శాఖల అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
– శైలేందర్ , బోయిగూడ