శేరిలింగంపల్లి, మార్చి 22: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లింకురోడ్ల నిర్మాణ పనులు కొండాపూర్‌లో శరవేగంగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన 100 అడుగుల కారిడార్-16 ప్రధాన రహదారి నుంచి మై హోం మంగళ ఎదుట తీర్చిదిద్దుతున్న 100 అడుగుల కారిడార్-18 రహదారులకు అనుసంధానం చేస్తూ దాదాపు 2.1 కిలోమీటర్ పొడవుతో కారిడార్-14 పేరిట నిర్మాణ పనులు నెల రోజులుగా జోరుగా సాగుతున్నాయి. 60 అడుగుల వెడల్పుతో దాదాపు రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ లింకురోడ్డు నిర్మాణంతో కొండాపూర్ శిల్పాగార్డెన్, క్రాంతివనం, ఉడ్‌లాండ్ లేఅవుట్, ఎంఎంఆర్ లే అవుట్ కాలనీ, నార్నె ఎస్టేట్స్ తదితర కాలనీ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మూడు నెలల్లో కారిడార్-14 లింకురోడ్డు పనులు పూర్తి చేసేందుకు హెచ్ఆర్డీసీఎల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.