22 బృందాలుగా ఏర్పడి న సర్కిల్ అధికారులు
ఇప్పటి వరకు రూ.52 కోట్లు వసూలు
అబిడ్స్, మార్చి 22 : ఆస్తి పన్ను చెల్లింపు గడువు తేదీ మార్చి 31 కావడంతో అధికారులు పన్నువసూలు వేగిరం చేశారు. 22 బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పద్నాల్గవ సర్కిల్ కార్యాలయం పరిధిలో రూ.52 కోట్లు వసూలు కాగా మరో పది కోట్లు వసూలు చేసేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాస్ నేతృత్వంలో సిబ్బంది భవన యజమానుల వద్ద నుంచి పన్ను వసూలు చేసేందుకు గాను పాటు పడుతున్నారు. పలు ప్రభుత్వ భవనాలు, వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయి పడిన వారికి నిత్యం వారెంట్లను జారీ చేసి దుకాణాలను సీజ్ చేస్తుండడంతో పన్ను వసూలు జరుగుతోంది. డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం నిత్యం ఓ ప్రాంతాన్ని ఎంచుకుని వారెంట్లను జారీ చేయడంతో పాటు ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేస్తున్నారు.
బకాయిల వసూలుకు చర్యలు..
తొమ్మిది రోజుల గడువు మిగిలి ఉండడంతో అధికారులు బకాయిలను వసూలు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. భవన యజమానులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆస్తి పన్ను వసూలులో ఏవైనా అసమానతలు ఉంటే పరిష్కరించుకునేందుకు గాను ప్రతి ఆదివారం నిర్వహించిన పన్ను పరిష్కార సమావేశాల ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి వారి నుంచి ఆస్తి పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటున్నారు.
మరో ఆదివారం ఆస్తి పన్ను పరిష్కార వేదిక..
జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను గడువు తేదీ మార్చి నెలాఖరుతో ముగియనుండడంతో కొన్ని వారాలుగా ఆస్తి పన్ను పరిష్కార వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27 చివరి ఆదివారం ఆస్తి పన్ను పరిష్కార వేదికను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆస్తి పన్ను పరిష్కార వేదిక కొనసాగుతుంది.
నగర అభివృద్ధికి ఆస్తి పన్ను చెల్లించండి
నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆస్తి పన్ను బకాయిదారులు వెంటనే ఆస్తి పన్ను చెల్లించాలని ప్రజలను కోరుతున్నాం. గతేడాది టార్గెట్ను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం 22 బృందాలతో ఆస్తి పన్ను వసూలు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గడువు తేదీ దాటితే అపరాధ రుసుం విధిస్తాం. ఆస్తి పన్ను చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నాం.
– బి. శ్రీనివాసు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్