-కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 22 : కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములన్నింటినీ సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, నియోజకవర్గం కార్పొరేటర్లతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అని పేర్కొన్నా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి… గోదావరి జలాలతో తెలంగాణ బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చారని కొనియాడారు. ఏడేండ్ల పాలనలో ఏమి అభివృద్ధి చేశారనే వాళ్లకు ఒక్కసారి అద్భుత జలదృశ్యాన్ని చూపిస్తే నోటికి తాళాలు పడుతాయన్నారు. నాడు బీడువారిన పొలాలు.. నేడు దేశానికే అన్నంపెట్టే స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు అందించి రైతన్నల ముఖాల్లో ఆనందం నింపారన్నారు.
ఉచితంగా 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో రైతన్నలకు అండగా నిలిచారన్నారు. మరోవైపు విప్లవాత్మకమైన నిర్ణయాలతో సుపరిపాలన, ఆదర్శవంతమైన అభివృద్ధితో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబవర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మిషన్ భగీరత, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, పండాల సతీశ్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, ముద్దం నర్సింహ యాదవ్, మాజీ కార్పొరేటర్లు తూము శ్రవణ్‌కుమార్, పగుడాల బాబురావు, మాధవరం రంగారావు, టీఆర్ఎస్ పార్టీ నేతలు గౌసుద్దీన్, గోనె శ్రీనివాస్‌రావు, కృష్ణారెడ్డి, అంబటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.