ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
ఎర్రగడ్డ సాయిసారధినగర్లో ప్రభుత్వ స్థలాల బోర్డులు తొలగించి గుడిసెల ఏర్పాటు
పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు
జూబ్లీహిల్స్, మార్చి 22 : ఎర్రగడ్డ డివిజన్ సాయిసారధీనగర్లోని ప్రభుత్వ స్థలంలో కొంత కాలంగా గుడిసెల్లో నివాసముంటున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హామీ ఇచ్చారు. సాయిసారధీనగర్లో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ స్థలాలపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కలెక్టర్ శర్మన్ నేతృత్వంలో మంగళవారం సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, తహసీల్దార్ అన్వర్ హుస్సేన్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేశ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్‌ల బృందం పర్యటించారు. ఈ సందర్భంగా సాయిసారధీనగర్లోని ప్రభుత్వ స్థలాల్లో తొలగించబడిన బోర్డులు, ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గుడిసెలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ.. ఎర్రగడ్డ డివిజన్ సారధీనగర్ సొసైటీలో యూఎల్సీ క్లియర్ కాని ప్రభుత్వ స్థలంలో కొందరు నకిలీ పత్రాలతో కబ్జాలకు యత్నిస్తున్నారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఇటీవల అక్రమంగా వెలిసిన గుడిసెలను తొలగి స్తామని పేర్కొన్నారు. బోరబండ విజేత థియేటర్ ఎదురుగా ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలంలో కొందరు లారీలు పార్కింగ్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, సారధీనగర్లోని ప్రభుత్వ స్థలాల్లో, లే అవుట్ ప్రకారం ఉన్న రోడ్లు సైతం కనిపించకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలన్నింటిలో గుడిసెలు ఏర్పాటు కావడం వెనుక ల్యాండ్ మాఫియా హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్ బేగం, టీఆర్ఎస్ నాయకులు డి.సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషి, మహిళా నాయకురాలు పల్లవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉచితంగా నీరిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే
వెంగళరావునగర్, మార్చి 22 : పేద ప్రజలకు ఉచితంగా తాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జలమండలి శాఖ ఆధ్వర్యంలో వెంగళరావునగర్ డివిజన్ సిద్ధార్థనగర్ కాలనీలో ఇంకుడుగుంత ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భూగర్భ జలాల పరిరక్షణకు జలమండలి శాఖ అధికారులు, సిబ్బంది చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నీటిని పరిరక్షిస్తామని అందరితో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం లో కార్పొరేటర్ దేదీప్య, జలమండలి సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్, సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి వేణు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.