మారేడ్పల్లి/అడ్డగుట్ట, మార్చి 22: జల వనరులను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకుడు గుంత పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నీరు ఎంతో విలువైనవని, వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూగర్భజలాల పెంపు కోసం ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టడంతో పాటు నీటి పొదుపును అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బన్సీలాల్పేట కార్పొరేటర్ హేమలత, వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, జీఎం రమణారెడ్డి పలువురు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూనగర్ పార్కులో… ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని మారేడ్పల్లి నెహ్రూనగర్ పార్కు ఆవరణలో ఎమ్మెల్యే జి. సాయన్న, స్థానిక కార్పొరేటర్ కొంత దీపిక జల ప్రతిజ్ఞ చేసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ…మన జీవితాలను సుపంపన్నం చేసే నిధి భూగర్భ జలాలు అని పేర్కొన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు మెరుగవుతాయని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి జీఎం రమణారెడ్డి, మేనేజర్ హకీం, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
జల వనరుల పునరుద్ధ్దరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని భూగోళశాస్త్ర విభాగంలో ‘అంతరించిపోతున్న జలవనరులను పునరుద్ధ్దరించుకుందాం’ అనే అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ మహ్మద్ అక్తర్ ఆలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విభాగధిపతి ప్రొఫెసర్ బి. శ్రీ నాగేష్, సైన్స్ కళాశాల డీన్ ప్రొ.బాలకిషన్, హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఖాజా జవహర్ ఆలీలు హాజరై మాట్లాడుతూ… నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.ఈ సందర్భంగా వారు మంచినీటిని సక్రమంగా వినియోగించుకొని భవిష్యత్ తరాలకు అందించాలని ప్రతిజ్ఞ చేశారు.