బడంగ్‌పేట, మార్చి22: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంకల్పానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునివ్వడంతో పలు సంస్థలు, కంపెనీలు ముందుకొస్తున్నాయి. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆంగ్ల విద్యను బోధించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకుంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జిల్లెలగూడ, బడంగ్‌పేట, మామిడిపల్లి, రావిర్యాల, మీర్ఖాన్పేట, పులిమామిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లెలగూడ చల్లాలింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను మంత్రి బుధవారం ఉదయం ప్రారంభించనున్నారు.
పేద విద్యార్థులకు మేలు
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్‌లతో మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది. జిల్లెలగూడ చల్లాలింగారెడ్డి పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను బుధవారం మంత్రి ప్రారంభిస్తారు. కంప్యూటర్ కొనుకోలేని పేద విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయి. పేద విద్యార్థులు కంప్యూటర్ విద్యను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– కృష్ణయ్య, ఎంఈవో బాలాపూర్