భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో అవగాహన
శామీర్పేట, మార్చి 22: నీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు అయినప్పుడే భూగర్భ జలాలు పునరుద్ధరించడం సాధ్యమవుతుందని ఎంపీపీ హారిక మురళీగౌడ్, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి రేవతి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మూడుచింతలపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో సీడ్ స్వచ్ఛంద సంస్థ, భూగర్భజల శాఖల ఆధ్వర్యంలో మంగళవారం భూగర్భ జలాల నిర్వహణ, సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని సముద్రాల్లోకి వెళ్లకుండా రైతులు సంరక్షణ పద్ధతులైన ఇంకుడు గుంతలు, చెక్ డ్యాం, ఊట చెరువులు, ఊట కుంటలు నిర్మించుకోవాలన్నారు. దీని వల్ల తాగునీరు, సాగునీరు కొరత ఉండదన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కృష్ణవేణి, భూగర్భ శాఖ అధికారి డాక్టర్ సత్యనారాయణ, సీడ్ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ సీహెచ్.అశోక్, వంశీ, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు జరీనాబేగం, అమృత, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జవహర్నగర్ : సహజ వనరులను సంరక్షించుకుంటూ నీటిని పొదుపుగా వాడుకోవాలని డీఈఈ చెన్నకేశవులు అన్నారు. జవహర్నగర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ సందీప్, మున్సిపల్ సిబ్బంది రఘు, విద్యార్థులు పాల్గొన్నారు.