సిటీబ్యూరో, మార్చి 20 ( నమస్తే తెలంగాణ) : పర్యావరణ హిత ప్రజా రవాణా లక్ష్యంగా హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌ఫోర్టు అథారిటీ(ఉమ్టా) పనిచేస్తోంది. మోటారు ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థను తగ్గిస్తూ మానవ శక్తితో కూడిన రవాణా వ్యవస్థ (నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్టు)గా పిలిచే సైక్లింగ్‌ను నగరంలో పెంచడమే లక్ష్యంగా భవిష్యత్ ప్రజా రవాణా ప్రణాళికను రూపొందించింది. ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ప్రయాణం దోహదం చేస్తుంది. అలాంటి సాధనాన్ని నగరవాసులు మరింత ఎక్కువగా వాడుకునేలా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఉమ్టా సూచనలు చేసింది. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ చుట్టూ నెక్లెస్‌రోడ్డు, కేబీఆర్ పార్కు, బేగంపేట మెట్రోస్టేషన్ నుంచి రాజ్‌భవన్ మీదుగా ఖైరతాబాద్ జంక్షన్ వరకు పైలెట్ ప్రాజెక్టుగా రోడ్లకు ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్‌లను సుమారు 30 కి.మీ మేర ఏర్పాటు చేశారు. అదేవిధంగా నగరంలో మరో 163 కి.మీ సైక్లింగ్ మార్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి అందజేసింది. 2031 నాటికి మొత్తం 450 కి.మీ మేర సైక్లింగ్‌కు మెరుగైన మౌలిక వసతులను కల్పించాలని సూచిస్తూ ప్రభుత్వానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఉమ్టా అందజేసింది.
వెస్ట్ జోన్ పరిధిలోని ప్రధాన రహదారులపై…
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ మహానగరం పడమర వైపే చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇటు వైపు ఐటీ కారిడార్ ఉండడంతో నిత్యం లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు, భవననిర్మాణ రంగానికి సంబంధించిన వారు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్ సిటీ నుంచి వెస్ట్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో సైకిల్ ట్రాక్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో హైటెక్ సిటీ మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కోకాపేట, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాలకే అధిక ప్రాధాన్యతనిచ్చి మొత్తం 163 కి.మీ మేర సైక్లింగ్ ట్రాక్స్‌ను వీలైనంత వేగంగా ఏర్పాటు చేయాలని ఉమ్టా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
