బడంగ్‌పేట, మార్చి20: ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల విద్య బోధనను ప్రారంభించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఇన్ రిచ్మెంట్ కోర్సు (ఈఎల్‌ఈసీ)పై సోమవారం నుంచి శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిక్షణ ఉంటుందని అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలతోపాటు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నాలుగు శిక్షణ కేంద్రాలను జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులకు ఇచ్చే ఈ శిక్షణ 15 రోజులపాటు ఉంటుందని, మండలానికి మూడు బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. నాదర్గుల్ జెడ్పీహెచ్ఎస్, బహదుర్గూడ జెడ్పీహెచ్ఎస్, మహేశ్వరం జడ్పీహెచ్ఎస్, కందుకూరులో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో శిక్షణ కేంద్రంలో 45 మంది ఉపాధ్యాయులకు ముగ్గురు మెంటర్(రిసోర్స్ పర్సన్) శిక్షణ ఇస్తారు. శిక్షణ కేంద్రాలను జిల్లా సెక్టార్ అధికారులు, గజిటెడ్ హెడ్ మాస్టర్లు పర్యవేక్షిస్తారు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పని సరిగా హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుసీందర్ రావు ఆదేశాలు జారీచేశారు.
ఉపాధ్యాయులకు సెలవులు రద్దు చేశాం..
మహేశ్వరం, సరూర్‌నగర్, బాలాపూర్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులందరూ ఈఎల్‌ఈసీ శిక్షణకు హాజరు కావాలి. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలను అమలు చేస్తాం. ఉపాధ్యాయులందరికీ సెలవులు రద్దు చేశాం. శిక్షణ పూర్తయిన తర్వాతనే సెలవులు. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్యను ప్రభుత్వం ప్రవేశ పెడుతుంది.
– కృష్ణయ్య, ఎంఈవో