చర్లపల్లి, మార్చి19: గడిచిన ఐదు సంవత్సరాల్లో పద్మశాలి టౌన్షిప్ కాలనీ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని టౌన్షిప్, శ్రీ భావనరుషీ సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడు సీత ఆంజనేయులు పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని పద్మశాల టౌన్షిప్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్మశాలి టౌన్‌షిప్‌కు ఎన్నికలను ఈనెల23న నిర్వహిస్తామని, కాలనీలో మొత్తం ఓటర్లు 1868 ఉన్నారని తెలిపారు. కాలనీలో సభ్యత్వం, ఓటు హక్కు లేని వారు ప్యానల్ ఏర్పాటు చేసి కాలనీ సభ్యుల మధ్య ఐక్యతను దెబ్బతిసే విధంగా రాద్ధాంతాలను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో అడవిని తలపించేలా ఉండే కాలనీలో సభ్యులు ఇండ్లు నిర్మించుకునేలా 2019లో హైకోర్టు ఇంటి అనుమతులకు సంబంధించి అదేశాలు జారీ చేసిందని, అప్పటి నుంచి ఇండ్ల నిర్మాణం జోరుందకుందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా కాలనీలో వైద్యశాల, మార్కెట్ భవనంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి గతంలో సొసైటీకి డబ్బులు చెల్లించి ప్లాట్లు కేటాయించని 235మంది సభ్యులకు మార్కెట్ భవనంలో మడిగెను కేటాయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కాలనీలో ఇప్పటికే 75శాతం రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశామని, త్వరలో పూర్తి స్థాయిలో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.కార్యక్రమంలో కాలనీ నాయకులు రమేశ్, రామకృష్ణ, నాగభూషణం పాల్గొన్నారు.