ఆస్తిపన్ను వసూళ్లపై ఐదు సర్కిళ్ల అధికారులతో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సమీక్షా సమావేశం
ఎల్బీనగర్, మార్చి 19: ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని పూర్తిచేయాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ కోరారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం సమావేశ మందిరంలో ఐదు సర్కిళ్ల అధికారులతో జోనల్ కమిషనర్ పంకజ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు సర్కిళ్లలో ఇప్పటివరకు రూ.195.63కోట్ల పన్ను వసూలు చేయడం జరిగిందన్నారు. ఈ నెలాఖరు వరకు మరో రూ.40.95కోట్ల పన్ను వసూళ్ల టార్గెట్ ఉందన్నారు. అన్ని సర్కిళ్లలోని అధికారులు ఆస్తిపన్ను వసూళ్లపైన ప్రత్యేక దృష్టి పెట్టి టార్గెట్‌ను చేదించాలన్నారు. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ 50 డాకెట్ల వారీగా ఆస్తిపన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించామన్నారు. ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్లు హరి కృష్ణయ్య, మారుతీ దివాకర్, సురేందర్‌రెడ్డి, శంకర్, అరుణకుమారి, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.