మన్సూరాబాద్, మార్చి 19: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆగమయ్యకాలనీలో బాక్స్‌టైప్ డ్రైనేజీ పనులను కొనసాగిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ చింతలకుంట పరిధి ఆగమయ్యకాలనీలో కొనసాగుతున్న బాక్స్‌టైప్ డ్రైనేజీ పనులను శనివారం మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాసవి క్లబ్ అసోసియేషన్‌కు చెందిన కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడంతో 150 మీటర్ల మేర బాక్స్‌టైప్ డ్రైనేజీ నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిపారు. కాలనీలో ఎవరికీ నష్టం జరుగకుండా రోడ్డు వెంట డ్రైనేజీ ట్రంకులైన్ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలకు సహకరించాలని సూచించారు. సుమారు రూ.10కోట్లతో జరుగుతున్న బాక్స్‌టైప్ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే వానకాలం లోపు పనులను పూర్తి చేసి కాలనీల్లో వరదనీటి సమస్యలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంతుల రాజిరెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, టంగుటూరి నాగరాజు, సుమంత్, తదితరులు పాల్గొన్నారు.