తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా హోలీ
ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి
ముషీరాబాద్ జోన్ బృందం, మార్చి 18 : తెలంగాణ పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెపుతాయని రాష్ట్ర పశుసంవర్థక, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే మన సంస్కృతిని పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలకు ఎంతో ఆదరణ లభిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం హోలీ సందర్భంగా ఇందిరాపార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ సంబురాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె . లక్ష్మణ్, కార్మిక నాయకుడు మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొని సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే ప్రభుత్వం ఇందిరాపార్కు అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుందని అన్నారు. పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశామని అన్నారు.
అదే విధంగా పార్కులో స్విమ్మింగ్ ఫూల్‌ను ఏర్పాటు చేయాలని వాకర్స్ అసోసియేషన్ చైర్మన్ సుధాకర్ యాదవ్‌తో పాటు ప్రతినిధులు మంత్రికి వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెంటనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ట్యాంక్‌బండ్ నుంచి ఇందిరాపార్కునకు ‘రోప్ వే’ ను నిర్మించాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగాఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. హోలీ సంబురాల్లో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రోత్సాహకంగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, హోలీ సంబురాల నిర్వాహకుడు ప్రభాకర్, బీజేపీ కవాడిగూడ అధ్యక్షుడు మహేందర్‌బాబు, దిశ కమిటీ సభ్యుడు జి. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.