బడంగ్‌పేట/పహాడీషరీఫ్/కందుకూరు/మహేశ్వరం/ఆర్కేపురం, మార్చి 18: బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో హోలీ వేడకులు ఘనంగా నిర్వహించారు. మీర్‌పేట 45వ డివిజన్లో ప్రజలతో పాటు మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి హోలీ వేడుకల్లో కార్పొరేటర్ అక్కిమాధవి పాల్గొన్నారు. నాదర్‌గూల్‌లో నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ నివాసంలో, బడంగ్‌పేటలోని మాతృదేవోభవ మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు గిరి ఆధ్వర్యంలో, అల్మాస్గూడ, జిల్లెలగూడ, బాలాపూర్, జల్పల్లి, శ్రీరామకాలనీ తదితర ప్రాంతాల్లో వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాలనీ వాసులు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. జల్పల్లి పిట్టలగూడెంలో పార్థీలు జరుపుకొనే వేడకల్లో జల్పల్లి మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయించారు.
కందుకూరులో..
కందుకూరు మండల కేంద్రంతో పాటు 35గ్రామ పంచాయతీలు అనుబంధ గ్రామాల్లో శుక్రవారం హోలీ పండగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మండల కేంద్రంలో నవతరం యూత్ సభ్యులతో పాటు కందుకూరు పోలీస్ స్టేషన్ సీఐ లిక్కి కృష్ణంరాజు మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామస్తులతో హోలీ సంబురాలు జరుపుకొన్నారు.
అంబరాన్నంటిన హోలీ సంబురాలు
మహేశ్వరం, ఉప్పుగడ్డ తండా, గంగారంతో పాటు అన్ని గ్రామాల్లోని గిరిజనులు, యువకులు, మహిళలు నృత్యాలతో కాముని దహనం వద్ద పాటలు పాడుతూ హోలీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మండలంలో హోలీ పండుగను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ మధుసూదన్ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, ఎంపీటీసీ సుదర్శన్‌యాదవ్, నవీన్, కుమార్, ఈశ్వర్, వీరానాయక్, సీతారాం నాయక్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.