జూబ్లీహిల్స్, మార్చి18 : ఆస్తిపన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ ఆధికారులు దృష్టి సారించారు. వందశాతం ఆస్తిపన్ను వసూలుతో వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
రూ.26 కోట్ల ఆస్తిపన్ను వసూలే లక్ష్యం..
ఈ ఏడాది రూ.26 కోట్ల ఆస్తిపన్ను వసూలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అధికారులు ఇప్పటికే 80 శాతానికి పైగా ఆస్తిపన్ను వసూలు చేశారు.
మార్చి 31 తో ముగియనున్న గడువు..
ఆస్తిపన్నుపై చెల్లింపులకు మార్చి 31 తో గడువు ముగియనుండడంతో ఆస్తిపన్ను వసూలును వేగిరం చేశారు.ఈ ఏడాది 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ వందశాతం వసూలుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రూ.20 కోట్లకుపైగా వసూలు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు మొండి బకాయీలపై దృష్టి సారించారు. లక్ష్యాన్ని చేరేందుకు ఆస్తిపన్ను బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు.
సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలి..
అదనపు పెనాల్టీ భారం పడకుండా ఆస్తిపన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి బాటలు వేయాలి. ఈ మేరకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ లక్ష్యాన్ని చేరేందుకు కృషి చేస్తున్నాం. ఆస్తిపన్ను వసూలూకు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెకర్ల బృందాలు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. – ఎ. రమేశ్, డిప్యూటీ కమిషనర్