సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందాను మూడేండ్లుగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖైరతాబాద్ బల్దియా సర్కిల్లో పనిచేసే హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్ ఐజాజ్ ఖాసీం సూత్రధారిగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ఎస్ఆర్నగర్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నకిలీ సర్టిఫికెట్లన్నీ ఐజాజ్ ఖాసీం నేతృత్వంలోనే జారీ అవుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. మూడేండ్లుగా అతడు అక్కడే పనిచేస్తుండగా, మూడు నెలల కిందట ప్రస్తుతం పట్టుబడ్డ డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీశ్ పనిలో చేరాడు. గతంలో పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా దందాలో తోడ్పాటునందించినట్లు విచారణలో బయటపడుతున్నాయి. బర్త్ సర్టిఫికెట్లు కావాలంటే.. ఖైరతాబాద్ సర్కిల్ కార్యాలయం నుంచి ఒక్క రోజులోనే ఇప్పిస్తామని చెప్పుకునే ఏజెంట్లు చాలా మందే ఉండడంతో వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మూడేండ్లుగా సర్కిల్ కార్యాలయం నుంచి జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లపై ఆరా తీస్తున్నారు.
ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ?
జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి ఎంత మంది బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు..? వాటిని పరిశీలించి సర్టిఫికెట్లను ఎన్ని రోజుల్లో అప్లోడ్ చేశారు..? తిరస్కరించినవి..బల్దియా వెబ్సైట్లో అప్లోడ్ చేసినవి ఎన్ని..? అనే విషయాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. సాధారణంగా బర్త్ సర్టిఫికెట్ కావాలంటే.. జీహెచ్ఎంసీలోని సిటిజన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)లో దరఖాస్తు చేసుకోవాలి.. ఆ దరఖాస్తులను, దవాఖానాల నుంచి వచ్చిన రికార్డులను పరిశీలించిన తరువాత.. బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అయితే నిబంధనల ప్రకారం ఎన్ని ..? నిబంధనలు ఉల్లంఘించి ఎన్ని జారీ చేశారనే పూర్తి చిట్టాను పోలీసులు బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రధాన సూత్రధారి ఐజాజ్ ఖాసీం చిక్కితే ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం వస్తుందని ఎస్ఆర్నగర్ పోలీసులు పేర్కొంటున్నారు.