మణికొండ/ శంషాబాద్ రూరల్/బండ్లగూడ, మార్చి 18: నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం హోలీ సంబురాలు హోరెత్తాయి. శుక్రవారం శంషాబాద్, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో అధికశాతం ప్రజలు హోలీ ఉత్సవాలు జరుపుకున్నారు. గండిపేట మండల పరిధిలోని కోకాపేట, నార్సింగి, మంచిరేవుల, ఖానాపూర్, నెక్నాంపూర్, గండిపేట, వట్టినాగులపల్లి, మణికొండ, పుప్పాలగూడ తదితర గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.
శంషాబాద్ మండలం, మున్సిపల్ పరిధిలో..
శంషాబాద్ మండలం, మున్సిపల్ పరిధిలో హో లీ వేడుకలు ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకొన్నారు. మండలంలోని సుల్తాన్పల్లి, కేబిదొడ్డి, మ ల్కారం, నానాజీపూర్, కాచారం, నర్కూడ, కవ్వగూడ తదితర గ్రామాల్లో గురువారం రాత్రి కాముని దహనం చేసి హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. సుల్తాన్పల్లి గ్రామంలో సర్పంచ్ దండుఇస్తారి ఆధ్వర్యంలో రాత్రి కాముని దహనం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు.
కాముడి దహనం.. హోలీ సంబురం..
గురువారం రాత్రి పలు కూడళ్లలో కాముని దహనం చేయగా శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు హోలీ వేడుకల్లో పాల్గొన్ని ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. రాజేంద్రనగర్, ఉప్పర్పల్లి, అత్తాపూర్, శివరాంపల్లి, మైలార్దేవ్పల్లి, బండ్లగూడ జాగీర్ ప్రాం తాల్లో హోలీ వేడుకలు జరుపుకున్నారు.