సికింద్రాబాద్/బొల్లారం, మార్చి 15: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడి మిలటరీ అధికారుల తీరు చూస్తుంటే.. హైదరాబాద్‌లో ఉన్నది కంటోన్మెంటా.. లేక కంటైన్మెంటా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నాలుగున్నరేండ్లుగా ప్రజల్ని నిత్య నిర్బంధాలకు గురిచేస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నారు లోకల్ మిలటరీ అథారిటీ (ఎల్ఎంఏ)అధికారులు. ఫలితంగా కిలోమీటర్లోపు గమ్య స్థానం చేరేందుకు ఏకంగా 8 నుండి 9 కిలోమీటర్లు రాకపోకలు సాగించాల్సి వస్తున్నది. మరోవైపు ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిన డంపింగ్ యార్డు విషయంలోనూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు బోర్డు అధికారులు. వీరి వివక్షతో విసిగి వేసారిన ప్రజలు ఎన్నిసార్లు ఆందోళనబాట పట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. తాజాగా.. రోడ్ల మూసివేతపై ఓ వైపు సంతకాల సేకరణ చేపడుతూనే.. డంపింగ్ యార్డుతో పాటు ఇతర సమస్యలపై టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి స్థానిక ప్రజలు నిరసనలు ప్రారంభించారు.
వీరిది ఉల్లంఘన.. వారిది చోద్యం
లక్షలాది మంది ప్రజలు ఏళ్ల తరబడి వినియోగస్తున్న రోడ్లను లోకల్ మిలటరీ అథారిటీ అధికారులు మూసివేయడం పరిపాటిగా మారింది. అసలు మూసివేత విషయంలో తమ కార్యాచరణ ఏంటో ఇప్పటికీ ఆర్మీ అధికారులు వెల్లడించలేకపోతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తుంటే.. కేంద్రం చోద్యం చూస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 21 రోడ్లు మూసేయడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పైగా.. కంటోన్మెంట్లో రెండు రోడ్లు మాత్రమే మూసివేసినట్లు సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయానికి పాతర…
ఏఓసీ మూసివేసిన రోడ్లకు ప్రత్యామ్నాయం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాసింది. అయినా స్పందించిన దాఖలాలు లేవు. కనీసం.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం చేపడతామన్నా కొత్త కొర్రీలు పెడుతూ అడ్డుపడుతున్నది. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని సికింద్రాబాద్ క్లబ్ వెనుక వైపు నుంచి రామకృష్ణాపురం వరకు 4 కి.మీల మేర రూ.400 కోట్లతో ప్రత్యామ్నాయ రహదారి నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి బోర్డు పరిధిలోని 42 ఎకరాల స్థలం అవసరమవుతుంది. అయితే ఆ స్థలానికి సమాన విలువైన భూమి లేదా పరిహారం ఇవ్వాలని లోకల్ మిలటరీ అథారిటీ మడత పేచీ పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో రోడ్డు నిర్మిస్తున్నందున స్థలానికి పరిహారం ఎందుకు ఇవ్వాలో అడిగినా ఎల్ఎంఏ మాత్రం స్పందించడం లేదు.
కదం తొక్కిన టీఆర్ఎస్… కదలివచ్చిన జనం
తిరుమలగిరి లాల్‌బజార్‌లోని కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న గాంధీ కమ్యూనిటీ హాల్ నుంచి డంపింగ్ యార్డ్ తరలించాలని కోరుతూ మంగళవారం టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. కంటోన్మెంట్ బోర్డు, కేంద్ర సర్కారు విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెత్త వాహనాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. డంపింగ్ యార్డు చెంతనే ఉండడంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లి స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, ప్యారసాని గౌరీశంకర్, బోర్డు మాజీ సభ్యులు శ్యామ్‌కుమార్, ప్రభాకర్, పాండుయాదవ్, నళినికిరణ్లతో కలిసి మర్రి రాజశేఖర్‌రెడ్డి సువిశాలమైన రెండెకరాల స్థలంలో డంపింగ్ యార్డు నిర్వహణను పరిశీలించారు.
నాలుగైదు రోజుల్లో నిర్ణయం…
డంపింగ్ యార్డు ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు నాలుగైదు రోజుల్లో ఓ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని బోర్డు అధికారులు అఫ్జల్, దేవేందర్, మహేందర్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలోనే బోర్డు అనుమతితో డంపింగ్ యార్డు నిర్వహణ కొనసాగుతున్నదని… ఎవరికీ సమస్య లేకపోవడంతోనే నిర్వహిస్తున్నామన్నారు త్వరలోనే డంపింగ్ యార్డు తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
డంపింగ్ యార్డును తరలించాల్సిందే
చెత్త డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తక్షణమే తరలించాలి. కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడం శోచనీయం. మహిళలంతా కలిసి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న కనికరం లేదా? డెయిరీ ఫామ్ రోడ్డులో గతంలో బ్రిగేడియర్‌తో కలిసి అధికారులు డంపింగ్ యార్డు తరలింపు స్థలం కోసం పరిశీలన సైతం చేశారు. డంపింగ్ యార్డు తరలింపు ప్రక్రియను వేగవంతం చేసే వరకు ఆందోళనలను విరమించేది లేదు. ఏదో ఒక సాకుతో ఎల్ఎంఏ అధికారులు అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులను మూసివేసి చోద్యం చూస్తున్నారు.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి
కిలోమీటర్ల కొద్దీ తిరిగి రావాల్సి వస్తుంది
చాలా ఏండ్లుగా లకడావాల నుండి యాప్రాల్ వెళ్లే దారిని ఆర్మీ అధికారులు మూసివేశారు. ఇక్కడి నుండి కార్మికులు యాప్రాల్, బాలాజీ నగర్, నాగారం వరకు కూలీ నిమిత్తం పనికి వెళ్లేవారు. కానీ.. ఇప్పుడు బొల్లారం వాటర్ ట్యాంకు నుండి కౌకూర్ మీదుగా వెళ్లాల్సి వస్తుంది.
– మారుతి, ఫుట్‌వేర్ దుకాణం నిర్వాహకుడు, బొల్లారం
కమ్యూనిటీ హాల్‌ను తిరిగి నిర్మించాలి
పేదల సౌకర్యార్థం నిర్మించిన గాంధీ కమ్యూనిటీ హాల్‌ను డంపింగ్ యార్డుగా మార్చారు. భారీ వాహనాలతో ఇక్కడికి చెత్త తరలించడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కంటోన్మెంట్ బోర్డు అధికారులు చర్యలు తీసుకొని పేదల కోసం కమ్యూనిటీ హాల్‌ను తిరిగి నిర్మించాలని కోరుతున్నాం.
– బేబీ లత, ఓల్డ్ గాంధీనగర్, తిరుమలగిరి
రోగాల బారిన పడుతున్నాం
డంపింగ్ యార్డు వల్ల దోమలతో నిత్యం సావాసం చేస్తున్నాం. దీని కారణంగా చిన్న పిల్లలతో పాటు ముసలివాళ్లు కూడా రోగాల బారిన పడుతున్నారు. చెత్త దుర్గంధంతో ఆసుపత్రి పాలవుతున్నాం. గతంలో ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఫలితం దక్కలేదు. ఈ సారైనా డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి.
– గడ్డం సరోజ,శాస్త్రినగర్, తిరుమలగిరి
ప్రస్తుత రోడ్లు…
మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని ప్రజలు కంటోన్మెంట్ ప్రాంతం గుండా నగరంలోకి ప్రవేశించేందుకు రెండు ప్రధాన మార్గాలున్నాయి.
1. అల్సెయింట్స్ రోడ్డు: కుషాయిగూడ, ఈసీఐఎల్, ఏఎస్ రావునగర్, నేరేడ్మెట్ ప్రజలు ఆర్కేపురం ఆర్వోబీ మీదుగా కేంద్రీయ విద్యాలయం తిరుమలగిరి (కేవీటీ) చౌరస్తా నుంచి నేరుగా తిరుమలగిరి చౌరస్తాకు చేరుకునే అవకాశ ముంది. ఈ మార్గం మిలటరీ ప్రాంతం గుండా వెళ్తుంది.
2. గాఫ్ రోడ్డు: కేవీ తిరుమలగిరి నుంచి ఏఓసీ చౌరస్తాకు చేరుకునే మార్గం. తిరుమలగిరి చౌరస్తా వద్ద ట్రాఫిక్ రద్దీ కార ణంగా ఆల్‌సెయింట్స్ రోడ్డు నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు చేరుకునేందుకు అనువుగా ఈ మార్గం ఉంది. వాహనదారులు కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి చౌరస్తా వద్ద ఎడమవైపు నుంచి ఏఓసీ, అటు నుంచి ఈస్ట్/ వెస్ట్‌మారేడ్‌పల్లి మీదుగా వెళ్తుంటారు.
3. మార్నింగ్టన్ రోడ్డు: గాఫ్ రోడ్డులో కంప్ట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ కార్యాలయం పక్క నుంచి నేరుగా తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లే మార్గం.
4. ఆర్డినెన్స్-వెల్లింగ్టన్ రోడ్డు: సఫిల్‌గూడ నుంచి ఏఓసీ వరకు ఆర్డినెన్స్ రోడ్డు అని, ఏఓసీ నుంచి వెస్ట్ మారేడ్‌పల్లికి దారితీసే మార్గాన్ని వెల్లింగ్టన్ రోడ్డుగా వ్యవహరిస్తారు. మల్కాజిగిరి, సఫిల్‌గూడ ప్రాంతానికి చెందిన వాహనదారులు సఫిల్‌గూడ రైల్వే క్రాసింగ్ మీదుగా ఏఓసీ నుంచి ఈస్ట్/వెస్ట్ మారేడ్‌పల్లికి చేరుకుంటారు.
ఎత్తయిన పిల్లర్ల నిర్మాణానికీ అడ్డంకే…
మిలటరీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు స్కైవేలతో పరిష్కారం లభిస్తుంది. అలహాబాద్ గేట్, వెల్లింగ్టన్ రోడ్, గాఫ్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ ప్రాంతాలను కలుపుతూ ఏఓసీ రూట్ నుంచి వెళ్లేందుకు స్కైవేలు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. వీటికి ఎలాంటి డిఫెన్స్ భూములు అవసరం లేదని. కేవలం ఈ ప్రాంతంలో స్కైవేలకు అవసరమైన ఎత్తయిన పిల్లర్ల నిర్మాణానికి అనుమతించాలని మిలటరీ అథారిటీని కోరింది. దీనిపై లోకల్ మిలటరీ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినా నిర్ణయం మాత్రం ప్రకటించడం లేదు. ఎత్తయిన పిల్లర్ల నిర్మాణం చేపడితే భద్రతా పరమైన సమస్యలు ఉంటాయంటూ దాటవేస్తూ వస్తున్నది.
స్కైవేలూ కట్టనివ్వరు…
ఎస్ఆర్డీపీలో భాగంగా ప్యాట్నీ- శామీర్‌పేట మార్గంలో 20 కి.మీ. వరకు, ప్యారడైజ్ సుచిత్ర మార్గంలో 10 కి.మీ. మేర స్కైవేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఆయా మార్గాలను 100-150 ఫీట్ల వెడల్పులో విస్తరించే అవకాశముంది. రూ.3 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు 90 ఎకరాల రక్షణ భూమి అవసరమవుతుంది. దీంతో పాటు, ఏఓసీ రోడ్లకు ప్రత్యామ్నాయంగా మరో 40 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం భూ బదలాయింపు కింద ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని భూమిని రక్షణ శాఖకు అప్పగిస్తామని రాష్ట్ర ప్రభ్వుం ప్రతిపాదించినా కేంద్రం బుట్టదాఖలు చేసింది.
ఇంకా మూసి ఉన్న రోడ్లు…
లక్డావాలా రోడ్డు, హోలీ ట్రినిటీ చర్చి రోడ్, మిల్కాసింగ్ కాలనీ రోడ్డు, బొల్లారం పార్కు పక్కన రోడ్, అమ్ముగూడ వద్ద ఉన్న బట్టికలోవా రోడ్, లాల్‌బజార్ నుంచి ఫ్యాకల్టీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వెళ్లే రోడ్డు, ఎంప్రెస్ రోడ్డు తదితర అంతర్గత రోడ్లు ఇంకా మూసి ఉన్నాయి. ఇక కౌకూర్ రోడ్డుపై తరచూ మిలిటరీ అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, ఐడెంటిటీ కార్డులు చూసి రాకపోకలకు అనుమతిస్తున్నారు.