సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ మరో రెండు చోట్ల ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. రూ.9.28 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎల్బీనగర్ అండర్ పాస్ (ఆర్హెచ్ఎస్), రూ. 28.642 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్ గూడ (ఎల్హెచ్ఎస్) వంతెనను బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎల్బీ నగర్ ప్రాంతంలో రవాణాకు సంబంధించి పలు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
తొలగిపోనున్న ట్రాఫిక్ ఇక్కట్లు
విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్ కూడలి అత్యంత ప్రధానమైనది. వరంగల్, నల్లగొండ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు అండర్ పాస్, ఫె్లైఓవర్ నిర్మాణాలను చేపట్టారు. ఎల్బీ నగర్ కూడలి (ఆర్హెచ్ఎస్), ఎడమ వైపు రూ.40 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు గల అండర్ పాస్ 12.875 మీటర్ల వెడల్పు 72.50 మీటర్ల బాక్స్ పోర్షన్ 3 లేన్ల యూని డైరెక్షన్లో ఈ అండర్ పాస్ నిర్మాణం చేపట్టారు.
వంతెన రాకతో మహా ఉపశమనం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మిధాని మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను నివారించేందుకు సుమారు రూ.29 కోట్ల వ్యయంతో బైరామల్ గూడ (ఎల్హెచ్ఎస్) ఫె్లై ఓవర్ 780 మీటర్ పొడవు 400 మీటర్లు డక్ పోర్షన్, 380 ఆర్.ఈ వాల్, 12.50 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లతో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన రాకతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.