సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సురేశ్ తెలిపారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్యను అభ్యసించిన వారు సైతం హాజరుకావాలని సూచించారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళ, బుధవారం రెండు రోజులపాటు జేఎన్టీయూ హైదరాబాద్ వేదికగా మెగా జాబ్‌మేళాను యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఈ మెగా జాబ్‌మేళాకు దాదాపు 20 వేలకు పైగా నిరుద్యోగులు హాజరయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. సాధారణ డిగ్రీలు పూర్తి చేసిన వారితో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీకామ్/బీఏతో పాటు పీజీలు పూర్తి చేసి ఉండాలనీ, టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలకు ఐటీ, టెక్నాలజీ రంగానికి చెందిన ఉద్యోగాలకు బీటెక్/ఎంటెక్ పూర్తయి ఉండాలని పేర్కొన్నారు. ఐటీఐ, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి కూడా కొన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని యూనివర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.
ఈనెల 16,17 తేదీల్లోజాబ్మేళా
నిరుద్యోగ సమస్యను తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని, అందులో భాగంగా టీ- సేవ కేంద్రం ఆధ్వర్యంలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 16,17 తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మణికొండ ల్యాంకో హిల్స్‌లోని సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన జాబ్వేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్‌మేళాలో ఇంటర్, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీఏ అర్హత గల అభ్యర్థులు పాల్గొనవచ్చని, ఆసక్తి గల యువకులు వాట్సాప్ ద్వారా కూడా బయోడేటాను పంపవచ్చని తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 102 పేరొందిన ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్నట్లు చెప్పారు. వివరాలకు 9505800048లో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై ఇస్తున్న శిక్షణ పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేలా శ్రమిస్తానని మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసేందుకు ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆన్లైన్ ద్వారా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు చెందిన 1291 మంది ఉపాధ్యాయులకు, ఉన్నత పాఠశాలల్లోని భాషేతర 790 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఇంగ్లిష్ బోధన విజయవంతమయ్యేలా చూస్తానని చెప్పారు. పల్లవి మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా విద్యాధికారి విజయ్‌కుమారి, సెక్టోరియల్ అధికారులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.