సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను హారన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ట్రై పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకనుంచి కొరడా ఝళిపించనున్నారు. “హైదరాబాద్ రోడ్లపై రోజు రోజుకు శబ్దకాలుష్యం పెరుగుతున్నది. జంక్షన్ల వద్ద మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజారోగ్యానికి హాని కలుగుతున్నది” అని వివరిస్తూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీకి లేఖ రాశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్రతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌లను అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేసి నెల రోజుల్లో కార్యాచరణ ఖరారు చేయాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీనిపై కసరత్తు మొదలు పెట్టారు..
శబ్దకాలుష్య నియంత్రణకు సహకరించండి : ట్రాఫిక్ జాయింట్ సీపీ
శబ్దకాలుష్యాన్ని అరికట్టేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వచ్చి పోలీసులతో కలిసి పనిచేయాలని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ కోరారు. శబ్దకాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిటీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం కాలుష్య నియంత్రణ బోర్డు, ఆర్టీఏ, ఆర్టీసీ, కార్ డెకర్స్ యాజమాన్యాలు, వాహనాలను మోడిపై చేసే మెకానిక్‌లు, హై ఎండ్ కార్లు, బైక్‌ల డిస్ట్రిబ్యూటర్లు, ట్రావెల్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. శబ్దకాలుష్యం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్‌ను హారన్ ఫ్రీ సిటీగా మార్చాలని పిలుపునిచ్చారు. అనంతరం కంట్రోల్ రూం వద్ద వాహనాలకు సంబంధించిన శబ్దకాలుష్యాన్ని తనిఖీ చేశారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డీసీపీలు ఎన్.ప్రకాశ్‌రెడ్డి, పి.కరుణాకర్, ఆర్టీఓలు దుర్గాప్రసాద్, సీపీ వెంకటేశ్వరరావు, జి.సురేశ్ రెడ్డి, వి.శ్రీనివాస్‌రెడ్డి, జి.సదానందం, ఎం.ఎస్.నారాయణరావు, కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ సైంటిస్ట్ డి.నరేందర్, తదితరులు పాల్గొన్నారు.