సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ) : 100 ఇండ్లలో చోరీలకు పాల్పడిన ఓ దొంగ రూటు మార్చాడు. గంజాయి దందాలోకి దిగాడు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తుండగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని 120 కేజీల గంజాయి, 2 లీటర్ల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ ప్రాంతానికి చెందిన శ్రీరామ్ నరసింహ చారిపై 2004 నుంచి 2016 వరకు హైదరాబాద్ ట్రై పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 100 చోరీ కేసులు ఉన్నాయి. అయితే నరసింహచారి రూటు మార్చాడు. అరకు ప్రాంతానికి చెందిన వెంకట్ ద్వారా గంజాయి, హషీష్ ఆయిల్ తెప్పించుకుని నగర శివారు ప్రాంతంలో విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల కిందట నరసింహచారి అతడి స్నేహితుడు గుజ్జారీ ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అరకు వెళ్లారు. 120కేజీల గంజాయి, 2 లీటర్ల హషీష్ ఆయిల్ కావాలని వెంకట్‌కు ఆర్డర్ చేశాడు. సిద్ధమయ్యాక నరసింహచారి తన బామ్మర్దులు వడ్ల గణేశ్ చారి, చింతపల్లి అరుణ్, కుమార్‌ను రెండు కార్లలో పిలిపించుకున్నాడు. ఓ కారులో మొత్తం గంజాయి, హషీష్ ఆయిల్ నింపుకొని అందులోనే నరసింహచారి, వడ్ల గణేశ్ చారి, కుమార్, గుజ్జారి వస్తుండగా.. ఖాళీగా ఉన్న కారులో అరుణ్ ముందు వస్తున్నాడు. భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం తనిఖీలు చేపడుతుండగా.. తప్పించుకునే క్రమంలో ఫ్లైఓవర్ బ్రిడ్జీని ఢీకొట్టి పోలీసులకు పట్టుబడ్డారు. పైలటింగ్ చేస్తున్న అరుణ్ తప్పించుకున్నాడు. నిందితుల నుంచి రూ.35 లక్షలు విలువ చేసే గంజాయి, కారు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చింతూర్ టూ జహీరాబాద్ గంజాయి తరలింపు
ఏపీ నుంచి జహీరాబాద్‌కు గంజాయి తరలిస్తుండగా 102 కేజీల గంజాయిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం నేరేడ్మెట్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం, సీతంపేట్ గ్రామానికి చెందిన బి.రవి 2019లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత గొర్రెల వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని దారుకొండ సంతకు వెళ్ళేవాడు. అక్కడ చింతూరు ప్రాంతానికి చెందిన సురేశ్ పరిచయమయ్యాడు. గంజాయి తరలిస్తే ట్రిప్పుకు రూ.20 వేలు ఇస్తానని దూర ప్రాంతాలకు అయితే రూ.25 వేలు ఇస్తానని తెలుపడంతో రవి ఒప్పుకున్నాడు. ఈ నెల 13న ఆటోలో గంజాయి తరలిస్తుండగా.. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం ఘట్కేసర్ వద్ద ఆటోను తనిఖీ చేసింది. అందులో 102 కిలోల గంజాయి బయట పడింది. రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఏడాది కాలంగా దందా సాగిస్తున్నట్లు తెలిపాడు. ప్రధాన సూత్రధారి సురేశ్, భానుదాసు, రమేశ్, షాహీన్‌లు పరారీలో ఉన్నారు.