సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ): కాలేయ మార్పిడి అవసరమైన రోగులకు సులభంగా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు గాంధీ దవాఖాన సిద్ధమైంది. ఇందుకు ప్రధాన భవనంలోని 3వ అంతస్తులో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం, కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రభుత్వ రంగ దవాఖానల్లోని ఉస్మానియా, నిమ్స్‌లో మాత్రమే జరుగుతున్నాయి.
మరింత పెరగనున్న శస్త్ర చికిత్సల సంఖ్య
ఇప్పటి వరకు ఉస్మానియాలో 2013 నుంచి 2022 మార్చి 10 వరకు 13 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు, నిమ్స్‌లో 11 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్లు జీవన్‌దాన్ అధికారులు వెల్లడించారు. ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానలు కలిపి 2013 నుంచి నగరంలో ఇప్పటి వరకు మొత్తం 932 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గాంధీలో ప్రత్యేకంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వ దవాఖానల్లో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
పేదలకు సేవలు విస్తరించాలనే లక్ష్యంతో..
కాలేయ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొంత మందికి మందులతో వ్యాధులు నయమైతే మరికొంత మందికి కాలేయం విఫలమవడంతో ట్రాన్స్‌ప్లాంట్ తప్పడం లేదు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ దవాఖానల్లో ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు. గాంధీలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడున్న వారి కంటే మరింత ఎక్కువ మందికి శస్త్ర చికిత్సలు, కాలేయానికి సంబంధించిన ఇతర చికిత్సలు పెరుగుతాయి. దీని వల్ల నిరుపేద రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందడమే కాకుండా వారికి ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. త్వరలోనే ఈ యూనిట్ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నాం.
– డాక్టర్ రాజారావు,సూపరింటెండెంట్,గాంధీ దవాఖాన