కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 14 : వందశాతం ఆస్తిపన్ను వసూళ్లు చేసే దిశగా కూకట్పల్లి జంట సర్కిళ్ల అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. వార్షిక యేడాది గడువు మరో పదిహేను రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో మొండి బకాయిదారులందరి నుంచి పన్నులు వసూళ్లు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. గతేడాది పన్నులు చెల్లించి ఈ యేడాది పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వారు, దీర్ఘకాలికంగా పన్నులు చెల్లించని వారు, చెక్‌బౌన్స్‌లు చేసిన వారిపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. డాకెట్ల వారీగా బకాయిదారుల జాబితాలను సిద్ధం చేసుకుని రోజువారీ లక్ష్యాలతో పన్నులను వసూళ్లు చేస్తున్నారు. ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్‌తో సమాచారాన్ని ఇస్తున్నారు. స్పందించకుంటే రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆస్తిపన్ను విధింపులో సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతీ ఆదివారం పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. వివిధ పద్ధతుల్లో బకాయిదారులకు హెచ్చరికలు చేస్తున్నారు. అయినా స్పందించకుంటే ఆస్తులను జప్తు చేస్తున్నారు.
జంట సర్కిళ్ల డిమాండ్ 266.84 కోట్లు..
వార్షిక యేడాదిలో కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్లలో రూ.266.84 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ఇప్పటి వరకు జంట సర్కిళ్లలో రూ.138.70 కోట్లను వసూళ్లు చేశారు. మరో పదిహేను రోజుల్లో రూ.128 కోట్ల ఆస్తిపన్నులను వసూళ్లు చేయాల్సి ఉంది. మూసాపేట సర్కిల్ లక్ష్యం రూ.138.62 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రూ.78.50 కోట్లు వసూళ్లు చేశారు. కూకట్పల్లి సర్కిల్ లక్ష్యం రూ.128.22 కోట్లు ఉండగా రూ.60.20 కోట్లు వసూళ్లు చేశారు. మిగిలిన బకాయిల్లో కోర్టు కేసులు, గవర్నమెంట్ భవనాలకు సంబంధించిన ఆస్తిపన్నులు పోగా ఇంకా జంట సర్కిళ్లలో రూ.30 కోట్ల వరకు ఆస్తిపన్నులను వసూలు చేయాల్సి ఉంది.
స్పందించకుంటే ఆస్తుల జప్తు..
సకాలంలో పన్నులు చెల్లించని మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టరీత్యా ఆస్తులను జప్తు చేస్తున్నాం. వార్షిక యేడాది లక్ష్యాన్ని సాధించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. ఫోన్లు, ఎస్ఎంఎస్లతో సమాచారమివ్వడం, నోటీసులివ్వడం, ఆస్తులను జప్తు చేయడం లాంటి పనులు చేస్తున్నాం. రెవెన్యూ సిబ్బందికి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పన్ను విధింపులో అపోహలుంటే ఉప కమిషనర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నాం.
– కె.రవికుమార్, డీసీ, మూసాపేట సర్కిల్
నగరాభివృద్ధిలో భాగస్తులు కావాలి
సకాలంలో ఆస్తిపన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్తులు కావాలని కోరుతున్నాం. వార్షిక యేడాది గడువులోగా వందశాతం పన్నులు వసూళ్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డాకెట్ల వారీగా బకాయిదారులను గుర్తించి నోటీసులిస్తూ ఆస్తులను జప్తు చేస్తున్నాం. చెక్‌బౌన్స్‌లు, మొండి బకాయిలపై దృష్టిసారించాం. పన్నులు చెల్లించని వారిని వ్యక్తిగతంగా కలుస్తూ పన్నులను వసూళ్లు చేస్తున్నాం. మరో పదిహేను రోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటాం.
– పి.రవీందర్‌కుమార్, డీసీ, కూకట్పల్లి సర్కిల్