మారేడ్పల్లి, మార్చి 14: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నంబర్ 1 వద్ద దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షడు సత్యనారాయణ మా ట్లాడుతూ.. రైల్వేలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం కొనసాగుతుందని, తమకు ఇక్కడ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఇక నుంచి ప్రతి రోజూ రైల్వే కార్యాలయాల ఎదుట ధర్నా, నిరసన ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు. రైల్వే రంగంలో పని చేస్తున్న కార్మికులు ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. హైదరాబాద్ సికింద్రాబాద్ రేంజ్ పరిధిలో ఉన్న అన్ని రైల్వే యూనియన్, రైల్వే అధికారుల కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మజ్దూర్ యూనియన్ అదనపు జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్, యూనియన్ నాయకులు రాజిరెడ్డి , శ్రీనివాస్, రామ్మోహన్ లతో పాటు వివిధ బ్రాంచీలకు చెందిన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.