ఖైరతాబాద్, మార్చి 14 : ఆస్తి పన్నుల చెల్లింపునకు మరో రెండు వారాలే గడువు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొండి బకాయిదారులు, ఎగవేతదారులకు ఇప్పటికే రెడ్ నోటీసులు, వారెంట్లు జారీ చేయగా, ఆస్తిపన్నుల చెల్లింపుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ అవకాశం కల్పించింది. ప్రతి ఆదివారం ఆస్తి పన్ను పరిష్కార వేదిక ఏర్పాటు చేసి చెల్లింపుదారుల మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో రాబడి వస్తున్నా మరికొందరు మొండి బకాయిదారులు పన్నులు చెల్లించడంలో తాత్సరం చేస్తున్నారు. దీంతో మార్చి 31వ తర్వాత వారికి జరిమానాలు విధించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతున్నది.
ఖైరతాబాద్‌లో.రూ.118.33 కోట్లు
ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోఆస్తిపన్ను చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతున్నది. గత ఆర్థిక సంవత్సరం రూ.148.95 కోట్లు పన్నుల రూపంలో వచ్చాయి. అయితే ఈ ఏడాది కూడా నూటికి నూరు శాతం వసూలు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్చి 14 వరకు సర్కిల్-17లో రూ.118.33 కోట్ల పన్నులు చెల్లించారు. మరో రూ.30కోట్లు చెల్లింపులు జరిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
జూబ్లీహిల్స్‌లో రూ.136.61 కోట్లు
సర్కిల్ 18 పరిధిలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట,వెంకటేశ్వరకాలనీలు ఉంటాయి. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు నెలవుగా ఉన్న ఈ సర్కిల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. గతేడాది రికార్డు స్థాయిలో రూ.178.05 కోట్లు రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.136.61 కోట్లు వచ్చాయి. మరో రూ.41.44 కోట్ల వసూళ్లు కావాల్సి ఉంది.
గడువు దాటితే జరిమానా తప్పదు
ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులను త్వరగా చెల్లించాలి. మార్చి 31 గడువు దాటితే జరిమానా తప్పదు. నగరాభివృద్ధిలో కీలకమైన ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించి జీహెచ్ఎంసీకి సహకరించాలి. మరో రెండు వారాలు మాత్రమే గడువు ఉంది.
– వంశీకృష్ణ, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ 17