సికింద్రాబాద్, మార్చి 14: కంటోన్మెంట్ పరిధిలో ఇష్టానుసారంగా లోకల్ మిలటరీ అథారిటీ రోడ్లను మూసివేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాత్రివేళల్లో మాత్రమే ఆంక్షలు విధించేవారు……కానీ గత కొన్నాళ్లుగా ప్రస్తుతం పగలు కూడా రోడ్లను మూసివేస్తుండడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కిలోమీటరు దూరానికి పదికిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 7 రోడ్లు మాత్రమే తెరిచి ఉన్నాయని, మిగతా 21రోడ్లు మూసివేసి ఉండటాన్ని ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ క్రమంలో సోమవారం కంటోన్మెంట్లోని తిరుమలగిరి, బొల్లారం వార్డు పరిధిలోని పలు కాలనీలు, బస్తీవాసులు సంతకాల సేకరణతో పాటు కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. ప్రజా ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో కంటోన్మెంట్ బోర్డులో ప్రాతినిధ్యం వహించిన బోర్డు మాజీ సభ్యులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు సైతం మిలటరీ అధికారులపై ఒత్తిడి తీవ్రతరం చేసేందుకు సన్నాహాలు చేపట్టారు.