ఆర్ఆర్ఆర్(రీడింగ్, రికార్డు, రివైస్డ్)ను పాటిస్తే విజయం మీదే. నిరంతరం సిలబస్‌ను చదవడం, దానికి అనుగుణంగా పుస్తకాలను అధ్యయనం చేయాలి. ఒక విజేతగా నిలువాలంటే ఇనిషియేటివ్ అవసరం. ఖచ్చితత్వమైన సిలబస్‌కు అనుగుణంగా చదువును కొనసాగించాలి. జ్ఞానాన్ని సంపాదించేందుకు కోచింగ్ సెంటర్లకు రావొద్దు.. ఉద్యోగాలు సాధించేందుకు మాత్రమే రావాలి. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ఉద్యోగం కొట్టి బయటకు వెళ్లాలి. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్స్ పాత ప్రశ్నాపత్రాలతో పాటు యూపీఎస్సీ ప్రశ్నా పత్రాలను కూడా పరిశీలించి ప్రిపేర్ కావాలి.
చదివే పద్ధతి
విపరీతంగా చదవకూడదు. ఎదురొచ్చిన పుస్తకాలన్నీ చదవకూడదు. నియమిత సిలబస్‌ను పూర్తి చేసి రివిజన్ చేయాలి. అప్పుడే మనకున్న సమయంలో ప్రశ్నా పత్రాన్ని పూర్తి చేయగలుగుతాం. ఉదాహరణకు గ్రూప్-1లో 30 ప్రశ్నలు ఇస్తారు. అందులో 15 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కో ప్రశ్నకి 8 నిమిషాలు కేటాయిస్తూ.. జవాబును క్వాలిటీ, క్వాంటిటీ విధానంలో రాయాలి. ఒక 10 మార్కుల ప్రశ్నకు 200 పదాల్లో పూర్తిచేయాలి.
సీసీసీ విధానంలో..
సిలబస్‌పై కాన్సెప్ట్ (భావన) కాన్సిక్వెన్సెన్ పాజిటివ్-నెగెటివ్ (పరిణామాలు), కాంటెంపరరీస్ (సమకాలిన అంశాలు) విధానంలో చదవడం రాయడం పునశ్చరణ నిరంతరంగా కొనసాగించాలి. ప్రతి రోజు 200 పదాల డిస్క్రిప్టివ్ రైటింగ్‌ను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బొమ్మల రూపంలో, న్యూమెనిక్స్ మైండ్ మ్యాప్స్, టేబుల్స్, డయాగ్రామ్స్, పై డయాగ్రామ్స్తో పాటు పీపీటీ విధానంలో మననం చేసుకోవాలి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ప్రతి రోజూ తగినంత నిద్ర ఉండాలి. అభ్యర్థికి సుమారు రోజుకు 7 గంటల ఖచ్చితమైన నిద్ర అవసరం. నిత్యం 7 గంటలు చదవాలి. రెండు గంటలు చదివిన విషయాలను నోట్స్ రూపంలో సమీకరించుకోవాలి. పౌష్టికాహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చివరి పరీక్ష, ఇంటర్వ్యూ వరకూ అనుక్షణం అలర్ట్‌గా ఉండాలి. చదివిన అంశాలను 4 నుంచి 5 సార్లు రివిజన్ చేసుకోవాలి.
పాఠం నేర్చుకున్నట్లు సిలబస్‌ను నేర్చుకోండి
పాఠం నేర్చుకున్నట్లు సిలబస్‌ను నేర్చుకోవాలి. పూర్వపు ప్రశ్నాపత్రాలను తప్పకుండా అవగతం చేసుకొని పోల్చి చూసుకోవాలి. మీ చదువును నమ్ముకోండి.. విజయం సాధిస్తారు. అపోహలను నమ్మొద్దు. పక్కవాళ్లను అనుసరించొద్దు. ఏ అభ్యర్థి ఏ గూప్ ఉద్యోగానికి సిద్ధమవుతున్నారో వారు ప్రణాళికను రూపొందించుకోవాలి. ఒకేసారి చదవుతూ పోవద్దు. చదవాలి.. రివిజన్ చేయాలి. ఇది నిత్యం జరుగుతూ ఉండాలి. నిరుత్సాహ పరిచేవారిని దూరం పెట్టి, మీ గమనాన్ని చేరేందుకు పట్టుదలతో ముందుకు సాగండి.
– వంగీపురం ప్రశాంతి, డిప్యూటీ కమిషనర్, జీహెచ్ఎంసీ
రూమర్స్‌ను నమ్మకండి
ఇంటర్వ్యూలో 2 మార్కుల తేడాతో మొదటి ప్రయత్నంలో మిస్ అయ్యాను. రెండోసారి రాతపరీక్షలోనే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సాధించాను. కాబట్టి మీరు రాతపరీక్షలోనే ఎక్కువ స్కోర్ చేసేందుకు కృతనిశ్చయంతో నిశితంగా అధ్యయనం చేయాలి. ఇంగ్లిష్ మీడియంలో ఒకప్పుడు మెటీరియల్ లేకుండేది. ప్రస్తుతం ఆ సమస్య లేదు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలో మంచి మెటీరియల్ అందుబాటులో ఉంది. కాబట్టి చదివింది చదివినట్టు సొంతంగా నోట్స్ చేసుకుంటే ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోవడానికి సులువవుతుంది. రూమర్స్ నమ్మకుండా.. చదవడంపై ధ్యాసపెట్టి పరీక్షకు సిద్ధం అవ్వండి.
– డాక్టర్ నవీన్‌చంద్ర, ఎక్సైజ్ సూపరింటెండెంట్, నిజామాబాద్
స్మార్ట్ వర్క్ చేయండి
అకడమిక్ ప్రొఫైల్ వేరుగా ఉంటుంది. పోటీ పరీక్షలకు తయారయ్యే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి పోటీ పరీక్షల్లో అన్ని పుస్తకాలను డంపు చేసుకొని చదవడం వల్ల పొరపాట్లు దొర్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగతంగా దృఢమైన లక్ష్యంతో అధ్యయనాన్ని కొనసాగించాలి. కొవిడ్ పాండమిక్ నుంచి ఎంతో శ్రమపడి ‘ఇండియన్ జాగ్రఫీ ఫర్ మెయిన్స్ ఇన్ క్వశ్యన్ అండ్ అన్సర్స్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోండి.
– శ్రీహరి, జాగ్రఫీ సీనియర్ ఫ్యాకల్టీ, 21st సెంచరీ అకాడమీ
పుస్తకాల ఎంపిక బాగుండాలి
గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇచ్చిన సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాల ఎంపిక ఉండాలి. ప్రిపరేషన్ సమయంలో పూర్తిగా స్వీయనియంత్రణలోకి వెళ్లాలి. సోషల్ మీడియాను పక్కన పెట్టాలి. నోట్స్ రూపకల్పన చేసుకోవాలి. ఎంచుకున్న మెటీరియల్ కూడా చదవడానికి సమయానుకూలత ఏర్పాటు చేసుకోవాలి. పరీక్షా విధానానికి ఉపయోగపడే విధంగా చదవాలి. పరీక్ష హాల్‌కు వెళ్లేముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే పాక్టీస్ చేసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి పాటించకున్నా.. విజయంలో ప్రతికూల అంశాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. నిరంతరాయంగా అభ్యసన ప్రణాళికను అమలు చేయాలి. తమ అకాడమీ ఈ నెల 21 నుంచి తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో మొదటి బ్యాచ్‌ను ప్రారంభించబోతుంది.
– రమణారెడ్డి, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్