సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాలైన బహదూర్‌పల్లి, తొర్రూర్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లే అవుట్లలోని ప్లాట్లను 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ప్లాట్ల విక్రయాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ లిమిటెడ్ ఈ-యాక్షన్ ద్వారా విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బహదూర్‌పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన లేఅవుట్లో 101 ప్లాట్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని తొర్రూర్‌లో 117 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లో 223 ప్లాట్లను మొదటి దశలో విక్రయిస్తున్నారు. ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్ గత నెలలో విడుదల జేశారు. కొనుగోలు చేసే వారి పేర్ల నమోదు ప్రక్రియ, ప్రీబిడ్ మీటింగ్స్, ఈఎండీల చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో ఉప్పల్ భగాయత్‌లో హెచ్ఎండీఏ చేపట్టిన తరహాలోనే పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తూ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. బహదూర్‌పల్లి లేఅవుట్లో చదరపు గజానికి నిర్ధారించిన కనీస ధరను రూ.25,000లుగా, తొర్రూర్‌లో చదరపు గజానికి రూ.20,000లుగా నిర్ణయించారు. చదరపు గజానికి కనీస బిడ్ పెంపుదలను రూ.500ల చొప్పున పెంచాల్సి ఉంటుంది.