సిటీబ్యూరో, మార్చి 13(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరం పరిధిలో ఉన్న గ్రామాలకు సైతం భవన నిర్మాణ అనుమతుల విధానం పట్టణాలకు వర్తించనట్లే ఒకే విధంగా ఉండేలా హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. భవన నిర్మాణ అనుమతుల్లో ఒకే విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం, జీహెచ్ఎంసీ పరిధి మినహాయిస్తే గ్రేటర్ చుట్టూ ఉన్న ఏడు జిల్లాల పరిధి అంతా హెచ్ఎండీఏలోకే వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణాల కోసం కొత్తగా తీసుకువచ్చిన టీఎస్ బీ పాస్ రాష్ట్రమంతా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో టీఎస్ బీ పాస్‌ను అమలు చేస్తుండగా, గ్రామ పంచాయతీల్లో మాత్రం గతంలో హెచ్ఎండీఏ ప్రారంభించిన డీపీఎంఎస్ (డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం) విధానంలోనే అనుమతులు జారీ చేస్తున్నారు. డీపీఎంఎస్ విధానంలో అనుమతుల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రధానంగా ఒక దరఖాస్తు చేస్తే, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు నెలల తరబడి సమయం పడుతోంది. అదే టీఎస్ బీ పాస్ విధానంలో అయితే, అన్ని ఆన్లైన్లోనే ఆయా శాఖల నుంచే అనుమతులు వస్తాయి. ఈ విధానం ఎంతో పారదర్శకంగా ఉండటంతో హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతులకు టీఎస్ బీ పాస్‌ను మాత్రమే అమలు చేయాలని నిర్ణయించారు.
హెచ్ఎండీఏ పరిధిలో 40 మున్సిపాలిటీలు.. 719 గ్రామాలు
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట హెచ్ఎండీఏ పరిధిలోని 40 మున్సిపాలిటీలు ఉండగా, 719 వరకు గ్రామాలు ఉన్నాయి. శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ప్రధానంగా ఔటర్ రింగు రోడ్డు లోపల సైతం హెచ్ఎండీఏ పరిధిలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అనుమతుల్లో జాప్యం వస్తుండటంతో అక్రమ కట్టగాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలకు జీ ప్లస్ 2 వరకే అనుమతి ఇచ్చే అవకాశం ఉండటంతో దానిని తీసుకొని కొందరు 3, 4, 5 అంతస్తులతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన హెచ్ఎండీఏ పూర్తి స్థాయిలో టీఎస్ బీ పాస్‌ను గ్రామాల్లో అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దానికి అనుగుణంగానే త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని టీఎస్ బీ పాస్ ద్వారానే అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉందని హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తెలిపారు.