కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 13 : టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫతేనగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిని సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఏండ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు కండ్లముందు కనబడుతుందన్నారు. ఈ పనులకు ఆకర్షితులై ఫతేనగర్ డివిజన్‌కు చెందిన పి.మధుసూదన్ యాదవ్, రియాజ్, బి.ప్రవీణ్, ప్రభాకర్ తో పాటు వారి అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
క్రీడాకారుల భ్యున్నతికి కృషి ..
క్రీడాకారుల భ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్ రమ్యాగ్రౌండ్లో భగత్‌సింగ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాల్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు హాజరై ప్రారంభించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియంలు, షెటిల్ కోర్టులు, స్విమ్మింగ్ ఫూళ్లను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. తద్వారా క్రీడాకారులు మెరుగైన శిక్షణ పొందేందుకు అవకాశం లభిస్తుందన్నారు. క్రీడాకారులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తాను చాటడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఆటల పోటీలలో సత్తా చాటిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నేతలు ఉన్నారు.