సైదాబాద్, మార్చి 12: ఐటీ హబ్ ప్రకటనలతో హైదరాబాద్ మహా నగరంలోని మలక్‌పేటకు సైతం మహర్దశ పట్టనుంది. నగరంలో పలు ఐటీ ప్రాంతాల మాదిరిగానే మలక్‌పేట కూడా ఐటీ సెక్టార్‌గా ప్రాధాన్యం సంతరించుకోనుంది. మలక్‌పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాల (మలక్‌పేట బీ-బ్లాక్ క్వార్టర్స్) ప్రాంతంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సంబంధిత అధికారులు స్థల అన్వేషణ చేస్తున్నారు. తొలి విడతగా 10 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటుకు నిర్ణయించారు. దీంతో గురువారం అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఐటీ హబ్ ఏర్పాటు పనులపై సభలో చర్చ లేవనెత్తారు. మలక్‌పేట ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, కసరత్తు మొదలైందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఐటీ హబ్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో శుక్రవారం మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కావటంతో ఐటీ హబ్ ఏర్పాటుపై ప్రాధాన్యత సంతరించుకుంది.
శంకుస్థాపనకు అడుగులు..
శాసనసభలో మలక్‌పేట ఐటీ హబ్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రకటన చేసిన వెంటనే ఐటీ శాఖ అధికారులు ఆచరణలోకి దిగారు. మంత్రి కేటీఆర్‌తో ఐటీ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఇతర ఉన్నతాధికారులతో పాటు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో శుక్రవారం సమావేశమయ్యారు. మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఏర్పాటు ప్రక్రియపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. తొలి విడతగా 10 ఎకరాల్లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు సమాచారం. ఐటీ హబ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని శాసన సభ సమావేశాలు ముగిసిన తర్వాత మంచిరోజును నిర్ణయించారని తెలిసింది. మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్ స్థలం వృథాగా ఉండటంతో క్వార్టర్స్‌ను కూల్చివేసి అక్కడే ఐటీ హబ్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా స్థానిక క్వార్టర్స్‌లో ఉన్న 65 ఎకరాల్లో ఎంసీ క్వార్టర్స్ ఉన్న 10 ఎకరాల స్థలాన్ని హబ్‌కు కేటాయించారు. పాతబస్తీలో ఐటీ హబ్ ఏర్పాటుతో స్థానిక అభివృద్ధికి కీలకంగా మారనుంది.
ఎమ్మెల్యేలు కోరటంతోనే ఐటీ పార్కు…
పాతబస్తీ అభివృద్ధి కోసం ఐటీ సెక్టార్ గానీ, పరిశ్రమలు గాని ఇచ్చి అభివృద్ధి చేయాలని ఎమ్మె ల్యేలు పాషా ఖాద్రి, బలాల కోర టంతో మామిడిపల్లిలో హార్డ్‌వేర్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అదే విధంగా మలక్‌పేట బీ-బ్లాక్‌లోని ఆర్ అండ్ బీకి చెందిన పది ఎకరాల స్థలంలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయటానికి సిద్ధంగా ఉన్నాం. మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఐటీ పార్క్ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారు. త్వరలోనే తగు చర్యలు తీసు కుంటాం. యువతకు జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– కేటీ రామారావు, ఐటీ శాఖ మంత్రి
త్వరలోనే శంకుస్థాపన..
మలక్‌పేట బీ-బ్లాక్ క్వార్టర్స్‌లో ఐటీ శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరి శీలించి నివేదిక ఇచ్చిన వెంటనే సంబంధింత శాఖల అధికా రులతో మంత్రి కేటీఆర్ మలక్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. మంత్రి కేటీఆ ర్, ఐటీ శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి నేను కూడా హాజరై పలు విషయాలను వెల్లడించాను. అదే విధంగా ఇప్పటికే పలుమార్లు ఐటీ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తో చర్చించాం. మంత్రి కేటీఆర్ ఐటీ హబ్‌కు ఏర్పాటుచేసే ప్రదేశాన్ని ఐటీ బృందంతో పరిశీలి స్తారు. పరిశీలన అనంతరం, మంత్రి ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు. ఎన్నో రోజులుగా ఎదురుచూ స్తున్న ఐటీ హబ్ మలక్‌పేటలో త్వరలోనే ఆవిష్కారం కానుంది.
– అహ్మద్ బిన్ బలాల, ఎమ్మెల్యే