సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర శివారు ప్రాంతాలైన బహదూర్‌పల్లి, తొర్రూర్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లే అవుట్లలోని ప్లాట్లను 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ప్లాట్ల విక్రయాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ లిమిటెడ్ ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బహదూర్‌పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన లే అవుట్లో 101 ప్లాట్లు, అదే విధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తొర్రూర్‌లో 117 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న లే అవుట్లో 223 ప్లాట్లను మొదటి దశలో విక్రయిస్తున్నారు. ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్ గత నెలలో విడుదల చేసి, కొనుగోలు చేసే వారి పేర్ల నమోదు పక్రియ, ప్రీ బిడ్ మీటింగ్స్, ఈఎండీల చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో ఉప్పల్ భగాయత్‌లో హెచ్ఎండీఏ చేపట్టిన తరహాలోనే పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తూ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. బహదూర్‌పల్లి లే అవుట్లో చదరపు గజానికి నిర్ధారించిన కనీస ధరను రూ.25,0000లుగా, తొర్రూర్‌లో చదరపు గజానికి రూ.20000లుగా నిర్ణయించారు. చదరపు గజానికి కనీస బిడ్ పెంపుదలను రూ.500ల చొప్పున పెంచాల్సి ఉంటుంది.
లే అవుట్ల ప్రత్యేకతలు…
100 శాతం ఎటువంటి చిక్కులు లేని క్లియర్ టైటిల్ ఉన్న ప్రభుత్వ భూమి.
సత్వర నిర్మాణానికి అనువైన బహుళ ప్రయోజన ప్లాట్లు.
భూమి వినియోగానికి సంబంధించిన మార్పులు చేయాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన ప్రాంతాల మధ్యలో లే అవుట్లు.
సమగ్ర మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి అన్ని పనులు 18 నెలల్లో పూర్తవుతాయి.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ప్రభుత్వ లేఅవుట్లలో పార్కులు, మిగతా సౌకర్యాల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు.
ప్లాట్ల వేలానికి సంబంధించిన అన్ని వివరాలతో పాటు ప్రతి ఒక్క సైటుకు సంబంధించిన ఈ బ్రోచర్లు హెచ్ఎండీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.